ఎర్రబెల్లి మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.!

ఎర్రబెల్లి మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.!
  • ప్రణీత్‍రావుతో ప్రతిపక్షనేతల ఫోన్లు ట్యాప్​ చేయించినట్లు ఆరోపణలు
  • వార్‍ రూం బాధ్యులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఆఫీసర్లు

వరంగల్‍, వెలుగు: రాష్ట్రంలో ఎస్‍ఐబీ మాజీ డీఎస్పీ ఆఫీసర్‍ దుగ్యాల ప్రణీత్‍రావు ఫోన్‍ ట్యాపింగ్‍ వ్యవహారం సంచలనం సృష్టిస్తుండగా.. ఈ ఇష్యూ ఇప్పుడు వరంగల్‍ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు మెడకు చుట్టుకుంటున్నది. ప్రణీత్‍రావుతో కలిసి ఎర్రబెల్లి దయాకర్‍రావు తన నియోజకవర్గంలోని ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్‍ చేయించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్‍ జిల్లాలోని మంత్రి సొంతూరైన పర్వతగిరి మండల కేంద్రంగా వార్‍రూం ఏర్పాటు చేసి ప్రణీత్‍రావు పర్యవేక్షణలో ఈ టాస్క్ నడిచినట్లు తెలుస్తున్నది. ప్రణీత్‍రావు విచారణ సందర్భంగా ఎర్రబెల్లి వ్యవహారం బయటకొచ్చినట్లు సమాచారం. ప్రణీత్‍రావు సొంత జిల్లా వరంగల్‍. ఆయన అత్తగారి ఊరు, దయాకర్‍రావు స్వగ్రామం పర్వతగిరి కావడం.. ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్లంతా మాజీ మంత్రి బంధువులే కావడంతో ఈ అభియోగాలకు బలం చేకూరుతోంది.

ఎర్రబెల్లితో బంధుత్వం.. 

ప్రణీత్‍రావు ఫోన్‍ ట్యాపింగ్‍ లింకులు హైదరాబాద్‍ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు సొంతూరు పర్వతగిరిలో తేలాయి. కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్‍రావు కుటుంబానికి, ఎర్రబెల్లి దయాకర్‍రావు కుటుంబానికి మధ్య బంధుత్వం ఉంది. ప్రణీత్‍ది ఇదే వరంగల్‍ జిల్లా నల్లబెల్లి మండలంలోని మేడిపల్లి. ఆయన అమ్మమ్మ ఊరు, మాజీ మంత్రి సొంతూరైన పర్వతగిరే కావడం విశేషం. ఈ క్రమంలోనే చుట్టాల ద్వారా ఎర్రబెల్లికి, ప్రణీత్‍రావు దగ్గరైనట్లు తెలుస్తున్నది.

పర్వతగిరిలో వార్​రూమ్?

ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్ కు ఎర్రబెల్లి సహకరించారని, పర్వతగిరిలోనూ ఓ వార్​రూమ్​ ఉందనే విషయాన్ని విచారణలో ప్రణీత్​రావు బయటపెట్టాడని తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో ఎర్రబెల్లిపై పోటీకి దిగిన ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు కాంగ్రెస్‍ పార్టీలో కీలక లీడర్ల సమాచారాన్ని ప్రణీత్​రావు ఎప్పటికప్పుడు ఇక్కడి వార్‍ రూంకు చేరవేసేవాడని తెలుస్తున్నది. వార్‍ రూం బాధ్యులుగా ఉమ్మడి వరంగల్​ జిల్లాకు చెందిన ఇద్దరు ఆఫీసర్లను నియమించినట్లు పోలీస్​వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఫోన్‍ ట్యాపింగ్‍ వ్యవహారం ఎర్రబెల్లి కులానికి చెందిన 25 మంది ఆఫీసర్లు కీరోల్‍ పోషించారని తెలుస్తున్నది.