
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేట రూరల్, వెలుగు: సమాజ భవిష్యత్ టీచర్లపైనే ఆధారపడి ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శనివారం సిద్దిపేట వైశ్య భవనంలో ట్రస్మా అధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తాను సిద్దిపేటకు తెచ్చిన బీడీఎస్ కాలేజీ ని సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ కి తరలించారని, తమ ప్రభుత్వం రాగానే దానిని మళ్లీ సిద్దిపేటకు తెచ్చుకుంటామన్నారు.
ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి..
ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం చింత మడక గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీర నారి చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీదేవి చందర్ రావు, మాజీ సర్పంచ్ హంసకేతన్ రెడ్డి, రజకసంఘం అధ్యక్షుడు కనకయ్య పాల్గొన్నారు.