
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ క్యాడర్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లకు ఇంకోసారి తావివ్వబోమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘తొమ్మిదిన్నరేండ్లు అధికారంలో ఉన్నా క్యాడర్‌ను పట్టించుకోలేదన్న ఫీడ్‌బ్యాక్ మూడు రోజులుగా నిర్వహిస్తున్న సమావేశాల్లో వస్తున్నది.
అలాంటి తప్పిదాలు ఇకపై జరగవు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి తగిన గుర్తింపు ఉంటుంది” అని వివరించారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారని, మూడు చోట్ల కాంగ్రెస్విజయం సాధించిందని తెలిపారు.
ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కలిసికట్టుగా పని చేస్తే భారీ మెజార్టీతో చేవెళ్ల ఎంపీ సీటు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణ అంటేనే బీఆర్ఎస్. కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలు. వాటికి జాతీయ అంశాలే ప్రధానం. ఈ విషయం ప్రజలకూ తెలుసు. అందుకే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కే అండగా నిలుస్తారు. బీఆర్ఎస్ఎంపీలు ఉంటేనే ఢిల్లీలో తెలంగాణ అస్తిత్వం నిలబడుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది” అని చెప్పారు.
మేధావులు గొంతువిప్పాలి : నిరంజన్‌రెడ్డి
పంట సీజన్ ఎత్తిపోతున్నా రైతులకు రైతుబంధు సాయం ఇవ్వడం లేదని, గతంలో చిన్న తప్పులపై పెద్దగా మాట్లాడే మేధావులు ఇప్పుడు నోరు ఎందుకు మెదపడం లేదని, వాళ్ల నోళ్లకు పక్షవాతం వచ్చిందా అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. మేధావులు ఆత్మవిమర్శ చేసుకొని రైతుల పక్షాన గొంతు విప్పాలని కోరారు. ‘‘ఎన్నికలకు ముందు మేము రైతుబంధు వేయకుండా ఈసీకి కంప్లైంట్‌చేసి కాంగ్రెస్ అడ్డుకున్నది.
రైతులు బాధపడొద్దని, తాము గెలిచిన తర్వాత 5 వేలు కలిపి ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి సీఎం అయి ఇన్ని రోజులవుతున్నా ఎందుకు రైతుబంధు వేయడం లేదో సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.
ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తున్నది : రంజిత్‌రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే కాంగ్రెస్‌ను గెలిపించారని, ప్రజల తీర్పును శిరసావహిస్తామని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నదని ఆరోపించారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో బీఆర్ఎస్కు లక్ష ఓట్ల మెజార్టీ ఉందని, అందరం కలిసికట్టుగా పని చేసి గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు. ఢిల్లీలో తెలంగాణ పార్టీ అంటే బీఆర్ఎస్ మాత్రమేనని.. ప్రజలు బీఆర్ఎస్‌కే మద్దతునిస్తారని తెలిపారు. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోసపోయారని ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు.
ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లతో కేటీఆర్, హరీశ్ టెలికాన్ఫరెన్స్
గృహలక్ష్మి, దళితబంధు, గొర్రెల పంపిణీ లాంటి సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో వారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసిన ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్రోడ్లను కూడా రద్దు చేస్తున్నారని, వీటిపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రాజకీయ అక్కసుతో వ్యవహరిస్తున్నదని, అభివృద్ధి పనులను రద్దు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నదని మండిపడ్డారు.