- సీఎం రేవంత్ సవాల్‌కు హరీశ్‌రావు స్పందన
- మూసీ పునరుజ్జీవానికి మేం వ్యతిరేకం కాదు
- ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ దందాను నడువనియ్యం
- ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టలేదని సర్కారుకు ప్రశ్న
హైదరాబాద్, వెలుగు : ప్రజలకు లబ్ధి జరుగుతుందంటే పది నెలలైనా మూసీ వద్ద నివసించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తాను ఉద్యమకారుడినని, 10 వేల మందికి మంచి చేయడానికి మూసీలో నివసించేందుకు రెడీ అని పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. మూసీ పునరుజ్జీవానికి తాము వ్యతిరేకం కాదని అన్నారు. మూసీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తామంటే ఒప్పుకోబోమని అన్నారు. మూసీ విషయంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని 15 రోజుల కింద చెబితే, ఎందుకు పెట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవాన్ని తమ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించామని, వేల కోట్లు ఖర్చు పెట్టి ఎస్టీపీలు నిర్మించామని తెలిపారు. ఇప్పుడు కొత్తగా రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేసేదేమీ లేదని అన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు తాము 4 వేల ఇండ్లు నిర్మించి ఇచ్చామని, పరిహారం చెల్లించామని తెలిపారు.
మూసీ బాధితులకు కూడా 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 450 ఎకరాల ల్యాండ్‌కు సంబంధించి ఐఎంజీ స్పోర్ట్స్ సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టు కేసు గెలిచిందని, ఆ ల్యాండ్‌ను మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టడానికి ఉపయోగించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రెస్ మీట్‌లో అన్ని అబద్ధాలే చెప్పారని ఆరోపించారు. సీఎం తన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గ్రాఫిక్స్‌ను ప్రదర్శించారని ఆరోపించారు. సుందరీకరణ కాదంటూనే, మొత్తం సుందరీకరణ చూపించారని అన్నారు. మూసీని పునరుజ్జీవం చేయాలంటే ముందు పరిశ్రమల వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలన్నింటినీ ఫార్మాసిటీకి తరలించాలని సూచించారు. ఫార్మాసిటీ రద్దు చేయలేదంటూనే ఆ భూముల్లో ఫోర్త్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు.
సీఎం రేవంత్‌కు చాలెంజ్
సీఎంతోపాటు మల్లన్నసాగర్ వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని, డేట్ నిర్ణయించాలని హరీశ్ సవాల్ చేశారు. ‘‘ నేను చాలెంజ్ చేస్తున్న మీరు( సీఎం) డేట్ నిర్ణయిస్తారా? నన్ను నిర్ణయించమంటారా? రేపు ఉదయం 9 గంటలకు నేను మీ ఇంటికి వస్తాను. నేనే కారు నడుపుకుంటూ మిమ్మల్ని స్వయంగా తీసుకెళ్తా. మేం నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీ వద్ద చింతచెట్టు కింద మిమ్మల్ని కూర్చోబెట్టి ప్రజలతో మాట్లాడిస్తా. రంగనాయక సాగర్ కట్టమీద కూర్చొని మాట్లాడదాం. తొలుత మూసీ బాధితులతో మాట్లాడి, ఆ తర్వాత మల్లన్నసాగర్ కు వెళ్దాం” అని హరీశ్ అన్నారు.