
సూర్యాపేట, వెలుగు : మోదీకి బీ టీమ్ గా రేవంత్ రెడ్డి ఉన్నడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. మోదీ వద్ద కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు ప్రాధాన్యత లేదన్నారు. అవసరమైతే బీజేపీలో టీ కాంగ్రెస్ విలీనమవుతుందని, బీఆర్ఎస్ ఏ పార్టీలోనూ కలవదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై సుప్రీం కోర్టుని తప్పుపట్టేలా కొందరు కాంగ్రెస్ , బీజేపీ నేతలు సోయి లేకుండా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం సూర్యాపేట క్యాంప్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈడీ , సీబీఐలు నమోదు చేసిన అత్యంత చెత్త కేసుగా ఢిల్లీ లిక్కర్ కేసు చరిత్రలో మిగిలిపోతుంద ని ఆయన ఎద్దేవా చేశారు.
కర్ణాటకలో వాల్మీకి స్కామ్ కేసులో టీ కాంగ్రెస్ నేతల పాత్ర ఉన్నా, బీజేపీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడటంలేదని, ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లిక్కర్ కేసులో రాహుల్, రేవంత్ విరుద్ధంగా మాట్లాడుతున్నారని, కేసీఆర్ పై అనవసర మాటలు మాట్లాడి తమ బలహీనతలు బయటపెట్టుకుంటున్నారన్నారు. దేశంలో ఎప్పటికైనా మోడీ, రాహుల్ కి కేసీఆరే ప్రత్యామ్నాయని గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు.