
హైదరాబాద్ : పట్నం మహేందర్ రెడ్డిని బుజ్జగించేందుకు కేసీఆర్ మంత్రి పదవి ఇస్తుండని, ఇప్పుడు పట్నం తన పౌరుషం చూపాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. తాను తన నియోజకవర్గం కొల్లాపూర్ నుంచే పోటీ చేస్తానని, కేసీఆర్ లాగా పారిపోనన్నారు. కాళేశ్వరం కన్నా ముందే పాలమూరును స్టార్ట్ చేసినా ఇంకా ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు.
కేసీఆర్ పాలనలో పారదర్శకత లేదని, ఆయన పాలన పైన పటారం లోన లొటారం అని విమర్శించారు. పాలమూరు జిల్లాలో టీఆర్‌ఎస్‌కు గతంలో ఉనికే లేదన్నారు. గత ఎన్నికల్లో తన ఓటమికి చాలా కారణాలున్నాయని, అవి తానిప్పుడు చెప్పదలచుకోలేదన్నారు. రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా మార్చి నాలుగు నెలల ముందే వైన్ షాపుల టెండర్లు పిలిచారని విమర్శించారు. ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టారని, ప్రపంచంలోనే అంత ఖర్చు ఎవరూ పెట్టలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అట్లనే ఖర్చు పెడ్తరని చెప్పారు.
ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి గొప్పలు చెప్పుకుంటున్నరని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సినిమా ఎండ్ దశకు వచ్చిందని, తొమ్మిదేండ్ల నుంచి మీ సినిమా చూసి ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రజల దగ్గర దోచుకున్న సొమ్మునే ఓటర్లకు పంచి.. ఓట్లు కొనాలనుకుంటున్నారని, ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.