నాపై అన్యాయంగా ఏసీబీ కేసు పెట్టారు

నాపై అన్యాయంగా ఏసీబీ కేసు పెట్టారు

అప్పు చేశా గానీ తప్పు చేయలేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. తనపై అన్యాయంగా ఏసీబీ కేసు పెట్టారన్నారు.  బ్యాంకుకు డబ్బులు ఎగ్గొట్టానని ఎమ్మెల్యే హర్షవర్దన్  తనపై ఆరోపణలు చేశాడని.. ఇన్నేళ్లు  తన పరువుకు భంగం కలిగించారన్నారు.  తనపై ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు రుజువు చేయాలన్నారు.  సమస్య పరిష్కరించకుండా ఎమ్మెల్యే తనను బెదిరించారన్నారు.

తాను మంత్రిగా ఉన్నప్పుడు చట్ట ప్రకారం పరిహారం ఇప్పించానని తెలిపారు.  బాధితులు కాకున్నా ఎమ్మెల్యే అక్రమంగా  పరిహారం ఇప్పించారని ఆరోపించారు. బాధిత రైతులకు పరిహారం ఇంకా పూర్తి కాలేదన్నారు.  బాధితులందరినీ సమానంగా చూడాలన్నారు. తాను  లోన్ క్లియర్ చేసినట్లు తన దగ్గర లెటర్ ఉందన్నారు.  రూ.6 కోట్లు లోన్ తీసుకుని ఆలస్యం అయినందుకు రూ.14 కోట్లు సెటిల్ చేశానన్నారు.  అంబేద్కర్ చౌరస్తాలో  ప్రజలకు ఇబ్బంది కల్గుతుందనే  ఇంటికి రమన్నానని అన్నారు. రాత్రి నుంచి తాను ఇంట్లోనే ఉన్నానన్నారు జూపల్లి.

నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై  అంబేడ్కర్ చౌరస్తాలో చర్చకు రావాలని జూపల్లి సవాల్ విసరగా.. డైరెక్టుగా ఇంటికే వస్తానని చెప్పారు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి. ఇద్దరు నేతల సవాళ్లతో ఇవాళ తెల్లవారుజాము నుంచే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇద్దరు నేతల ఇళ్లకు చేరుకున్నారు. బహిరంగ చర్చకు తాము రెడీగా ఉన్నామని ప్రకటించారు.  జూపల్లి ఇంటికి బయల్దేరిన బీరం హర్షవర్దన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని జిల్లా కేంద్రానికి తరలించారు. దీంతో ఇరు వర్గాలు ఆందోళనకు దిగారు.