
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబును విశ్వసించే పరిస్థితి లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. 2019లో వచ్చిన ఫలితాలే 2024లో తెలుగుదేశానికి రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. శుక్రవారం (ఏప్రిల్ 14న) గుడివాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేశారు కొడాలి నాని.రాష్ట్రానికి చంద్రబాబు చేసింది ఏమీలేదని కొడాలి నాని అన్నారు. గుడివాడలో 23 వేల మంది పేదలకు ఇళ్లు ఇస్తున్నామని, రాష్ట్రాభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు తాము సిద్ధం అంటూ సవాల్ విసిరారు.
‘‘చంద్రబాబు 14 ఏళ్లు గుడివాడను గాలికి వదిలేశారు. ఇప్పుడు సిగ్గులేకుండా వచ్చి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం గుడివాడలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గుడివాడకు చంద్రబాబు ఏం చేశారు..? గుడివాడలో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతిసారి టీడీపీ ఓడిపోయింది. పేదల ఇళ్ల కోసం చంద్రబాబు ఒక్క ఎకరం కొన్నట్లు నిరూపించగలరా..? చంద్రబాబు నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా..? చంద్రబాబు జిత్తులమారి నక్క’’ అంటూ కొడాలి నాని దుయ్యబట్టారు.
‘‘సభలో ఖాళీ కుర్చీలకు చంద్రబాబు ఉపన్యాసం ఇచ్చారు. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలు కూడా చంద్రబాబు పెట్టలేదు. మేము పెట్టిన విగ్రహలకు చంద్రబాబు దండలు వేశారు. హరికృష్ణ ఎంపీగా ఉన్నప్పుడు నిమ్మకూరును అభివృద్ధి చేశారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న చిత్తుశుద్ధి చంద్రబాబుకు లేదు. నిమ్మకూరును ఉద్దరించామని చంద్రబాబు చెబితే ఎవరు నమ్ముతారు?’’ అంటూ కొడాలి వ్యాఖ్యానించారు.
కొడాలి నానిపై చంద్రబాబు విమర్శలు
‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు గురువారం (ఏప్రిల్ 13న) గుడివాడలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ‘గుడివాడ.. మహనీయుడు ఎన్టీఆర్ నడయాడిన నేల అని, అలాంటి గడ్డను అరాచకాలకు అడ్డాగా మార్చారని చంద్రబాబు విమర్శించారు. బూతుల ఎమ్మెల్యే తులసి వనంలో గంజాయి మొక్కలా తయారయ్యారని ఆరోపించారు. ‘రాజకీయ భిక్ష పెట్టాం. ఇప్పుడు చరిత్రహీనులుగా మారారు. అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎన్టీఆర్ గెలిచిన గుడివాడను పేకాట క్లబ్బులుగా మార్చారు. క్యాసినోలు తెచ్చారు. భూకబ్జాలు, ఇసుక, మట్టి మాఫియా.. అన్నీ అరాచకాలే. అభివృద్ధి పట్టదు. నోరు విప్పితే బూతులే. అలాంటి వ్యక్తిని ఏం చేయాలో మీరే తేల్చండి’ అంటూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పేరు ఎత్తకుండా విమర్శలు చేశారు.