
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌కు లక్కీ లాటరీలో అధికారం దక్కిందని, ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నాళ్లు ఉంటరో ఆయనకే తెలియదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాలమూరు కష్టాలకు కేసీఆర్ కారణం అని రేవంత్ చెప్పడం హస్యాస్పదంగా ఉందని అన్నారు. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి కాంగ్రెస్ పుణ్యమేనని విమర్శించారు.
కరెంటు, నీళ్లు, రైతుబంధు, రైతు భీమా ఇచ్చి రైతులకు అండగా నిలిచింది కేసీఆర్ అని, రేవంత్ అధికారంలోకి రాగానే అన్నీ కట్క బంద్ చేసినట్లుగా ఆగిపోయాయని దుయ్యబట్టారు. ‘‘కొడంగల్ సభలో రేవంత్ భాష, వ్యవహార శైలి ముఖ్యమంత్రి హోదాకు తగినట్లుగా లేవు. ముఖ్యమంత్రిగా అయ్యాక కూడా ఎందుకో రేవంత్ తన తీరును సమీక్షించుకోవడం లేదు” అని ఆయన విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. ఇప్పటికైనా ప్రజలకు ఏం చేస్తారో రేవంత్ చెప్పాలని, కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కొడంగల్ లో రేవంత్ శంకుస్థాపన చేసిన కాలేజీలు అన్నింటికీ గతంలో అనుమతులు తెచ్చింది కేసీఆర్ అని, ఇందులో రేవంత్ గొప్పతనం ఏముందని ప్రశ్నించారు. 174 టీఎంసీలు గ్రావిటీ ద్వారా పాలమూరుకు రావాల్సిన నీటిని పోగొట్టిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని, దశాబ్దాల పాటు జూరాల, నెట్టెంపాడు, భీమా పథకాల నిర్మాణాలను కాంగ్రెస్ పార్టీ సాగదీసిందని ఆయన దుయ్యబట్టారు. 35 ఏండ్లు, 40 ఏండ్ల పాటు పాలమూరు ప్రాజెక్టులను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగదీసి రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసి పాలమూరు ప్రాజెక్టులు ఎండబెట్టిందని వ్యాఖ్యానించారు.