భూములు కొట్టేసినోళ్ల చిట్టా రెడీ

భూములు కొట్టేసినోళ్ల చిట్టా రెడీ
  • ధరణి ద్వారా అక్రమాలకు పాల్పడినోళ్లపై ప్రభుత్వం ఫోకస్ 
  • లిస్టులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు 
  • నలుగురు ఐఏఎస్​లు, మరో ముగ్గురు రిటైర్డ్​ ఐఏఎస్​లపై నిఘా 
  • మాజీ మంత్రులు కొందరు 350 ఎకరాలు కొల్లగొట్టినట్టు గుర్తింపు.. 
  • వీటి విలువ రూ.7వేల కోట్లకు పైనే 
  • కొనసాగుతున్న ఇంటర్నల్ ఎంక్వైరీ.. రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలకు పాల్పడి, భూములు కొట్టేసినోళ్ల చిట్టాను రాష్ట్ర సర్కార్​రెడీ చేస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరెవరు అక్రమంగా భూలావాదేవీలు జరిపారనే దానిపై ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్నది. పూర్తి వివరాలు అందిన తర్వాత ఆధారాలను బేస్​ చేసుకుని లీగల్​ఓపీనియన్​ తీసుకుని ముందుకు వెళ్లాలని భావిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా పని చేసినోళ్లు మాత్రమే కాకుండా.. కొందరు ఐఏఎస్​అధికారులు కూడా భారీ భూదందా నడిపినట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆ ఐఏఎస్​ ఆఫీసర్ల లిస్టును కూడా సీక్రెట్ గా తెప్పించుకుంటున్నది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు అధికారులు ఎవరెవరికి? ఎక్కడెక్కడ? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? అనే వివరాలు సేకరిస్తున్నది. ఆ భూములు వారికి ఎలా వచ్చాయి? అంతకుముందు అవి ఎవరి పేర్ల మీద ఉన్నాయి? లావాదేవీలన్నీ సక్రమంగానే జరిగాయా? లేక ధరణి పోర్టల్​లో ఒక్క క్లిక్​తో తమ పేరు మీద నమోదు చేసుకున్నారా? కబ్జాలు చేశారా? బెదిరించి రాయించుకున్నారా? తప్పుడు పత్రాలు సృష్టించి నమోదు చేయించుకున్నారా? అనే కోణంలో సీక్రెట్​దర్యాప్తు చేయిస్తున్నది. 

also read : శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు

మాజీ మంత్రులు కొందరు.. తమ బంధువులు, బినామీల పేర్లతో భారీగా భూములు సమకూర్చుకున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీళ్లందరూ దాదాపు 350 ఎకరాలు కొల్లగొట్టినట్టు తెలుసుకుంది. వీటి విలువ బహిరంగ మార్కెట్​లో రూ.7వేల కోట్లకు పైనే ఉంటుంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్​నగర్, రంగారెడ్డి, వరంగల్​జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు ఈ లిస్టులో ఉన్నారని.. వాళ్ల భూములు మేడ్చల్ మల్కాజ్​గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఉన్నాయని గుర్తించింది. ఈ భూములన్నీ ఎకరాకు రూ.15 కోట్ల నుంచి రూ.30 కోట్లు పలికే ప్రాంతాల్లోనే ఉన్నట్టు తెలుసుకుంది. కాగా, ప్రభుత్వం మారిన తర్వాత చాలామంది ప్రముఖులు వారి భూముల వివరాలను ‘రైట్ టు ప్రైవసీ’ కింద ధరణిలో దాచుకున్నట్లు తెలిసింది. 

ఏడుగురు ఐఏఎస్ లపై నిఘా

సీఎస్​గా, సీసీఎల్ఏగా పనిచేసి రిటైర్ అయిన ఓ ఐఏఎస్​తో పాటు స్పెషల్​సీఎస్​ హోదాలో రిటైర్​ అయిన మరో ఐఏఎస్​కు సంబంధించిన భూముల వ్యవహారం.. ఇప్పటికే ఐఏఎస్​వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. వీరిద్దరితో పాటు మాజీ మంత్రి కేటీఆర్​ దగ్గర పని చేసిన స్పెషల్​సీఎస్ ఇంకొకరు కూడా భారీగా భూములు కూడబెట్టుకున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఇరిగేషన్​లో స్పెషల్​సీఎస్​గా పనిచేసి రిటైర్ అయిన సీనియర్​ఐఏఎస్ కుటుంబసభ్యుల పేరు మీద 52 ఎకరాలు ఉన్నట్టు ఎంక్వైరీలో తేలింది. ఇక మేడ్చల్​మల్కాజ్​గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లుగా పనిచేసిన మరో ముగ్గురు ఐఏఎస్​లపైనా ప్రభుత్వం నిఘా పెట్టినట్టు తెలిసింది. వారి హయాంలో ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున భూములను క్లియర్​చేశారనే వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్నది. 

ప్రొసీడింగ్స్​ లేకుండానే ధరణిలో మార్పులు

సాధారణంగా ఎవరైనా రైతు తన భూమికి సంబంధించి ఎక్కువ, తక్కువ విస్తీర్ణం నమోదైన, నిషేధిత జాబితాలో పెట్టినా, ఏ ఇతర సమస్య పరిష్కారం కోసమైనా ధరణి పోర్టల్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానిపై ఎమ్మార్వో విచారణ చేసి, కలెక్టర్​కు ఆన్​లైన్​లో ఫైల్​ పంపుతారు. దాని ఆధారంగా కలెక్టర్​అప్రూవల్​ఇస్తారు. లేదంటే సీసీఎల్​ఏ ఆమోదం కోసం పంపిస్తారు. ఇదంతా ఒక ప్రొసీడింగ్ ఫైల్​తో రన్​చేస్తారు. అయితే ఇలాంటి ప్రొసీడింగ్స్​ఏమీ లేకుండానే గత ప్రభుత్వంలో వేలాది ఎకరాల భూములను ధరణిలో మార్చేసినట్టు గుర్తించారు. ఇలా ధరణి పోర్టల్​లో ఒక్క క్లిక్​తో భూములు కొల్లగొట్టిన బడాబాబుల వివరాలనూ ప్రభుత్వం సేకరిస్తున్నది. ఈ వ్యవహారంపైనా విచారణకు ఆదేశించాలని భావిస్తున్నది.