
యాక్టర్, తెలంగాణకు చెందిన మోడల్ మరియు మాజీ మిస్ ఇండియా మానస వారణాసి అందరికీ సుపరిచితమే. నేడు (మే20న) మానస వారణాసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
మంగళవారం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయక మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణలో మిస్ వరల్డ్ అందాల పోటీలను అద్భుతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. అన్ని దేశాల నుండి సుందరీమణులు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో తిరుమల టెంపుల్, లడ్డు ప్రసాదాన్ని షేర్ చేసింది. ఇకపోతే మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన దేవకీ నందన వాసుదేవ మూవీలో మానస నటించింది. సత్య పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మానస వారణాసి:
మానస వారణాసి, తెలంగాణకు చెందిన మోడల్. అందాల పోటీ విజేత. ఫెమినా మిస్ ఇండియా 2020 అందాల కిరీటాన్ని అందుకుంది. మానస వారణాసి 1997, మార్చి 27న హైదరాబాదులో జన్మించింది. తండ్రి ఉద్యోగం కారణంగా మలేషియాకు వెళ్ళిన మానస 2011-12 బ్యాచ్‌లో GIIS మలేషియా క్యాంపస్ నుండి గ్రేడ్ 10 పూర్తి చేసింది.
ఆ తర్వాత హైదరాబాదుకి వచ్చి ఎఫ్ఐఐటి జెఈఈలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. 2019లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ పోటీలో పాల్గొన్న మానస.. టాప్ 3 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది. 2020లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్ కోసం ఆడిషన్ చేసి, అందులో విజేతగా నిలిచింది. 2021, ఫిబ్రవరి 10న మిస్ వరల్డ్ ఛాంపియన్ గా 10వ స్థానంలో నిలిచింది.