అర్వింద్ ఇంటిపై దాడి : సీవీ ఆనంద్‭కు బీజేపీ ఫిర్యాదు

అర్వింద్ ఇంటిపై దాడి : సీవీ ఆనంద్‭కు బీజేపీ ఫిర్యాదు

ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీపీ సీవీ ఆనంద్ కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అధికార పార్టీ నేతలు బహిరంగంగా బెదిరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చెప్పుతో కొడతా.. చంపుతామని కవిత బహిరంగంగా అంటున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కుటుంబపాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారా అని నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్న ఎంపీని మర్డర్ చేసేందుకే ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కవిత వ్యాఖ్యలపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. అరవింద్ ఇంటిపై దాడి చేసిన వారిపై 24 గంటల్లో చర్యలు తీసుకోనిపక్షంలో డీజీపీని కలుస్తామన్నారు. డీజీపీ కూడా స్పందించకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్‭లో గతంలో కూడా బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగిన ఇప్పటి వరకు కేసులు కూడా నమోదు చేయలేదని పోలీసులపై మండిపడ్డారు. ఎంపీ అరవింద్ ఇంటిపై దాడికి నిరసనగా బీజేపీ నేతలు, కార్యకర్తలు మండల స్థాయిలో కేసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.