
చిన్నశంకరంపేట, సిద్దిపేట రూరల్, చేర్యాల, కోహెడ(హుస్నాబాద్), గజ్వేల్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్పై కాంగ్రెస్ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్రెడ్డి, శశిధర్‌రెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి కాళేశ్వరం జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు.
అనంతరం మెదక్ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రాస్తారోకోను విరమింపజేసి మాజీ ఎమ్మెల్యేలతో పాటు, బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. సిద్దిపేటలోని రంగాధంపల్లి రోడ్డుపై బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రాస్తా రోకో నిర్వహించారు. బీఆర్ఎస్విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అమర వీరుల స్థూపానికి గోదావరి జలాల తో జలాభిషేకం నిర్వహించారు.
వారు మాట్లాడుతూ తెలంగాణ జీవధార కాళేశ్వరం అని సిద్దిపేట ప్రాంతంలో నిర్మించిన రంగనాయక సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టు లో అంతర్భగమే అన్నారు. చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో, కొమురవెల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్నాయకులు రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పై బురద చల్లే రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. హుస్నాబాద్‌లో బీఆర్ఎస్శ్రేణులు అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు నీటితో తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేశారు.
కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టుల వల్లే బీడు భూములతో ఉన్న తెలంగాణ నేడు సస్యశ్యామలం అయిందని పేర్కొన్నారు. గజ్వేల్ లో బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ రహదారి ప్రజ్ఞాపూర్ పాతూర్ బ్రిడ్జి వద్ద రాస్తా రోకో చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం వేసిన గోష్ కమిషన్ ఫేక్ కమిషన్ అన్నారు.