సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాటికొండ రాజయ్య

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాటికొండ రాజయ్య
  • కాంగ్రెస్లో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే విశ్వ ప్రయత్నం 
  • గత కొద్దిరోజులుగా ఢిల్లీలోనే తాటికొండ
  • వరంగల్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న తాటికొండ రాజయ్య 

ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కలిశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తు్న్న తాటికొండ.. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించని వరంగల్ పార్లమెంట్  స్థానంనుంచి టికెట్ ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డితో తాటికొండ రాజయ్య భేటీ ఆసక్తికరంగా మారింది.  

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. మే 13న ఎన్నికలు జరుగనున్నాయి. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నాయి. ఉమ్మడివరంగల్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలుండగా.. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి.  వరంగల్ పార్లమెంట్ స్థానంలో మాత్రం ఒక్క బీఆర్ఎస్ తప్పా కాంగ్రెస్, బీజేపీ ఇంకా క్యాండిడేట్లను ప్రకటించలేదు. దీంతో ఆశావహులు ఆ రెండు పార్టీల చుట్టు తిరుగుతున్నారు. 

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మైలేజీ బాగా పెరిగిపోయింది. దీంతో చాలామంది ఆ పార్టీనుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్ టికెట్ దక్కించుకునేందుకు ఆ పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే గత కొద్ది రోజులుగా ఢిల్లీలో ఉంటూ..పార్టీ పెద్దలను ఆశీర్వాదం పొందే పనిలో ఉన్నారు. 

2009 నుంచి 2018 వరకు స్టేషన్ ఘనపూర్ నియోజవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు తాటికొండ.. గత ఎన్నికల్లో కూడా బీఆర్ ఎస్ నుంచి టికెట్ ఆశించారు తాటికొండ రాజయ్య. అయితే బీఆర్ఎస్ తాటికొండకు బదులుగా కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చింది. కడియం విజయంతో తాటికొండ సైడ్ అయి పోయారు... పార్టీలో ఉండటం ఇష్టం లేక ఫిబ్రవరి 3న బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. 

బీఆర్ ఎస్ రాజీనామా చేసిన తాటికొండ.. కాంగ్రెస్ లో చేరేందుకు విశ్వ ప్రయత్నం చేశారు.. అయితే ఆ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.. జానకీపురం సర్పంచ నవ్య విషక్ష్ంలో తాటికొండపై తీవ్ర ఆరోపణలు రావడంతో అలాంటి వ్యక్తిని పార్టీలోచేర్చుకుంటే మేం పార్టీ వీడుతామని చెప్పడంతో కాంగ్రెస్ పెద్దలు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. 

ఈ క్రమంలో కొద్దిరోజులు స్తబ్ధుగా ఉన్న తాటికొండ మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టారు..ఇందులో భాగంగానే గతకొద్దిరోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ కావడంతో కాంగ్రెస్ లో చేరిక, టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు తాటికొండ.. తాజాగా సోమవారం( మార్చి 18) ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో తాటికొండ రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.