
బీఆర్ఎస్ లో టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా తలోదారి చూసుకుంటున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడారు. పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్కు పంపారు. బంగారు తెలంగాణ కోసం కలిసి రావాలని సీఎం పిలుపుతో తాను కాంగ్రెస్ ను వీడి ఆ పార్టీలో చేరానని మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ తెలిపారు. కానీ ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను కరీంనగర్ నుంచి పోటీలో ఉంటానని స్పష్టం చేశారు.
కరీంనగర్ కాంగ్రెస్లో కీలక నేతగా వ్యవహరించిన సంతోష్ కుమార్.. 2018లో బీఆర్ఎస్లో చేరారు. ఆ సమయంలో శాసనమండలిలో సంతోష్ కుమార్తో పాటు..మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బీఆర్ఎస్లో చేరారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్ గుర్తింపును రద్దు చేస్తూ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే బీఆర్ఎస్ లో చేరిన తర్వాత సంతోష్ కుమార్ ఎమ్మెల్సీ కానీ, మరి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ వస్తుందని ఆశించారు. కానీ ఇప్పటి వరకు అధికార పార్టీలో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో అసంతృప్తితో ఉన్న సంతోష్ కుమార్, ఎమ్మెల్యేల టికెట్లు ఖరారు కాగానే బీఆర్ఎస్ నుంచి వైదొలిగారు.
సంతోష్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని బీసీ, మైనార్టీ ఓటర్లలో సంతోష్ కుమార్కు గట్టిపట్టుంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారడం కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సంతోష్ కుమార్ కరీంనగర్ నుండి పోటీ చేస్తారని తెలుస్తోంది.