అనారోగ్యంతో మాజీ నక్సలైట్ మృతి

అనారోగ్యంతో మాజీ నక్సలైట్ మృతి
  • సంతాపం వ్యక్తం చేసిన మంత్రి వివేక్, పార్టీలు, కార్మిక సంఘాల లీడర్లు

కోల్​బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్​పట్టణం ఏజోన్​కు చెందిన మహిళ మాజీ నక్సలైట్ కంది రాజనర్సక్క(62) అనారోగ్యంతో మంగళవారం చనిపోయారు.1988 కాలంలో  సీపీఐ(ఎంఎల్) ఫణిబాగ్చి గ్రూపు రీజినల్​ కమిటీ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన కంది రాజరత్నం అలియాస్​సమరన్ ​భార్య రాజ నర్సక్క చాలా కాలం పాటు భర్తతో కలిసి అజ్ఞాతంలో ఉంటూ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో కార్యకలాపాలు నిర్వహించారు. 

రాష్ట్ర పీఓడబ్ల్యూ కమిటీ కన్వీనర్ గా సింగరేణి కార్మిక కాలనీల్లో తాగునీటి సప్లై, సారా అమ్మకాలు, వరకట్న దూరాచారా లకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారు. 1995లో భర్త రాజారత్నంను పోలీసులు బెల్లంపల్లిలో ఎన్​కౌంటర్​ చేయడంతో ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ప్రజా జీవితం గడిపారు. క్యాతనపల్లి మేజర్​ పంచాయతీలో సీపీఐ తరఫున ఒకసారి ఎంపీటీసీగానూ పనిచేశారు. సీపీఐ అనుబంధ మహిళా సమాఖ్యలో జిల్లా,రాష్ట్ర స్థాయి పదవుల్లో కొనసాగారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సక్క  వరంగల్​ ఎంజీఎం చికిత్స పొందుతూ తెల్లవారుజామున చనిపోయారు.

నమ్మిన సిద్దాంతం కోసం పనిచేసిన రాజ నర్సక్క: మంత్రి

కంది రాజనర్సక్క మృతి పట్ల రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకట స్వామి సంతాపం తెలిపారు. నమ్మిన సిద్దాంతం కోసం తన జీవితకాలం పనిచేశారని పేర్కొన్నారు. సామాజిక ఉద్యమాల పట్ల అంకితభావంతో పనిచేస్తూ  కార్మికులు, పీడిత ప్రజలకు అండగా నిలిచారని గుర్తుచేసుకు న్నారు. 

రాజనర్సక్క ఆత్మకు శాంతి చేకూరా లని, ఆమె కుటుంసభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాజనర్సక్క భౌతికకాయానికి ఏఐటీయూసీ స్టేట్​ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర నేత కలవేని శంకర్, జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్, అన్ని రాజకీయ, కార్మిక సంఘాల లీడర్లు నివాళులు అర్పించారు.