డీఎస్​కు కన్నీటి వీడ్కోలు .. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

డీఎస్​కు కన్నీటి వీడ్కోలు .. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
  • సంతాపం తెలిపిన ఖర్గే, సోనియా, రాహుల్​

నిజామాబాద్, వెలుగు:  ఉమ్మడి ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ డి.శ్రీనివాస్ అంత్యక్రియలు ఆదివారం నిజామాబాద్ లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. తమ అభిమాన నాయకుడిని కడసారి చూసి నివాళులు అర్పించడానికి పార్టీలకు అతీతంగా నాయకులు వచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు, డీఎస్ అభిమానులు వేలాదిగా తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. నిజామాబాద్ ప్రగతినగర్​లోని డీఎస్ ఇంటికి వెళ్లే రోడ్లతో పాటు అంతిమ యాత్ర కొనసాగిన రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. వర్షాన్ని సైతం లెక్కచేయక పెద్ద ఎత్తున జనం వచ్చారు. డీఎస్ చిన్న కుమారుడు ఎంపీ ధర్మపురి అర్వింద్, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుగౌడ్ యాష్కీ తదితరులు మధ్యాహ్నం 12 గంటలకు డీఎస్ పాడెను మోసి పూలతో ఆలంకరించిన వ్యాన్​లోకి ఆయన పార్థివదేహాన్ని ఎక్కించారు. అంతిమ యాత్ర ఎల్లమ్మగుట్ట, ఎన్టీఆర్ చౌరస్తా, కంఠేశ్వర్ మీదుగా బైపాస్ రోడ్డులోని ఆయన కుటుంబీకుల ల్యాండ్​కు మధ్యాహ్నం 3.30కు చేరింది. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించి తుపాకులతో గాలిలోకి మూడు రౌండ్లు కాల్చారు. డీఎస్ పెద్ద కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ తండ్రి చితికి నిప్పంటించి దహన సంస్కారాలు చేశారు.  

సీఎం రేవంత్ హాజరు 

కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం సేవలు అందించిన డి.శ్రీనివాస్​కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం హెలికాప్టర్ లో నిజామాబాద్ చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా డీఎస్ ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. డీఎస్ ఫ్యామిలీని పరామర్శించి, ఓదార్చారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తమ ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని తనకు సూచించారని సీఎం తెలిపారు. ఏఐసీసీ తరఫున కేరళ ఎంపీ కె.సురేశ్ వచ్చి డీఎస్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.  

పార్టీలకు అతీతంగా నేతల రాక 

రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరు పొందిన డీఎస్ కు నివాళి అర్పించడానికి అన్ని పార్టీల లీడర్లు తరలి వచ్చారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ, ఎమ్మెల్సీలు జీవన్​ రెడ్డి, మహేష్ ​గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ వివేక్​ వెంకటస్వామి, సుదర్శన్​రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, పైడి రాకేష్ ​రెడ్డి, ధన్​పాల్ సూర్యనారాయణగుప్తా, ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ మేయర్ నీతు దండూ కిరణ్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్​ రావు, బీజేపీ లీడర్ ప్రేమేందర్ ​రెడ్డి తదితరులు హాజరయ్యారు. 

డీఎస్‌‌ చొరవతోనే తెలంగాణ: సీఎం 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డీఎస్ కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. 2004లో ఉమ్మడి ఏపీ పీసీసీ ప్రెసిడెంట్​గా ఉన్న ఆయన.. సోనియా గాంధీని ఒప్పించడం వల్లే రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ఆమె మాట ఇచ్చారన్నారు. డీఎస్ భౌతికకాయానికి నివాళి అర్పించిన తర్వాత సీఎం మీడియాతో మాట్లాడారు. పదవుల పట్ల ఎలాంటి వ్యామోహం లేని లీడర్ డీఎస్ అని కొనియాడారు. కొన్ని కారణాలతో పార్టీ మారినా.. ఆయన ఎదురుపడినప్పుడు సోనియా ఆప్యాయంగా పలకరించేవారన్నారు.  మరణించినప్పుడు తన ఒంటిపై కాంగ్రెస్ జెండా కప్పాలని తనతో చెప్పారని సీఎం తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఇతర పెద్దలను పంపి డీఎస్ పార్థివదేహంపై కాంగ్రెస్ జెండాను కప్పి ఆయన కోరికను తీర్చామన్నారు. డీఎస్ జ్ఞాపకార్థం ఏం చేయాలన్న దానిపై ఆయన కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. 

పదవులకు వన్నె తెచ్చిన నేత: వివేక్ వెంకటస్వామి  

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి రాష్ట్ర పీసీసీ చీఫ్ గా ఉన్న డీఎస్ పట్టుదలతో ప్రత్యేక రాష్ట్రం కోసం పని చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి తెలిపారు. డీఎస్ సారథ్యంలోనే  పార్టీ 2004, 2009లో రెండుసార్లు రాష్ట్రంలో పవర్ లోకి వచ్చిందన్నారు. నిజామాబాద్ లో డీఎస్ అంతిమ సంస్కారాలకు హాజరైన అనంతరం మీడియాతో వివేక్ మాట్లాడారు. డీఎస్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘డీఎస్ రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగం వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద నాయకుడిగా ఎదిగారు. పొందిన అన్ని పదవులకూ ఆయన వన్నె తెచ్చారు. డీఎస్ ఆశయాలను ఆయన కుమారులు అర్వింద్, సంజయ్ నెరవేర్చాలి” అని ఆకాంక్షించారు.