ఇంత దిగజారుడు మాటలు ఏ ప్రధానీ మాట్లాడలే : మన్మోహన్ సింగ్

ఇంత దిగజారుడు మాటలు ఏ ప్రధానీ మాట్లాడలే : మన్మోహన్ సింగ్
  • పీఎం పదవి గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీ: మన్మోహన్ సింగ్
  • ఆయన విద్వేషపూరిత ప్రసంగాల వెనక దుర్మార్గపు ఆలోచనలు
  • ఆలోచించి ఓటు వేయాలని పంజాబ్ ప్రజలకు బహిరంగ లేఖ

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రసంగాలను మాజీ పీఎం మన్మోహన్ సింగ్ తప్పుపట్టారు. దేశానికి ప్రధానిగా ఉంటూ విద్వేషపూరిత, అన్​పార్లమెంటరీ ప్రసంగాలు చేయడం సరికాదన్నారు. గతంలో ఏ ప్రధాని కూడా ఇంతగా దిగజారి మాట్లాడలేదని మన్మోహన్ మండిపడ్డారు. ఒక వర్గం ప్రజలనుద్దేశించి విద్వేషపూరిత మాటలు మాట్లాడి ప్రధాని పదవి గౌరవాన్ని తగ్గించిన తొలి పీఎం మోదీనే అన్నారు. 

తప్పుడు మాటలు చెప్తూనే వాటిని ఇతరులకు ఆపాదించే కాపీరైట్ కూడా బీజేపీకే దక్కుతుందన్నారు. జూన్ 1న చివరి ఫేజ్ ఎన్నికలు జరగనున్నందున పంజాబ్ ప్రజలకు మన్మోహన్ సింగ్ గురువారం బహిరంగ లేఖ రాశారు. గత నెల రాజస్థాన్​లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​ను గెలిపిస్తే దేశ సంపదనంతా ఎక్కువ మంది పిల్లలు కనే వర్గానికి పంచిపెడుతుందని అన్నారు. దేశ ఆస్తులపై ఫస్ట్ ప్రయార్టీ ముస్లింలకే దక్కుతుందని మన్మోహన్ వ్యాఖ్యానించినట్లు మోదీ ఆరోపించారు. దీనిపై మన్మోహన్ తన లేఖలో మండిపడ్డారు.

ప్రజలకు ఇదే ఆఖరి అవకాశం..

మోదీ విద్వేష ప్రసంగాల్లో దుర్మార్గపు ఆలోచన ఉందని, అది దేశాన్ని విభజించే స్వభావాన్ని కలిగి ఉందని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. ‘‘2022 నాటికి రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తానని చెప్పిన మోదీ.. ఉన్న ఆదాయంపై దెబ్బ కొట్టిండు. ఎరువులు, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ బాదుడుతో రైతుల ఆదాయాన్ని మంటగలిపిండు. వ్యవసాయ చట్టాలపై ఆందోళన చేసిన రైతులను మోదీ అవమానించిండు. 

ఢిల్లీ బార్డర్​లో 750 మంది అన్నదాతల మరణాలకు కారణమైండు.  జీఎస్టీ, నోట్ల రద్దు, కరోనాను ఎదుర్కోలేక దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. దేశంలో అన్నింటి ధరలూ పెరిగినయ్. గ్రోత్ రేట్ పడిపోయింది. పదేండ్లలో పంజాబ్ రైతులను బీజేపీ సర్కారు నానారకాలుగా అవమానించింది”అని మన్మోహన్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ ఎన్నికలే ఆఖరి అవకాశమని, పంజాబ్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​ పిలుపునిచ్చారు.