రాజ్యసభ నుంచి మన్మోహన్ సింగ్ రిటైర్మెంట్

 రాజ్యసభ నుంచి  మన్మోహన్ సింగ్ రిటైర్మెంట్

కాంగ్రెస్ కురువృద్ధుడు,  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. ఆర్థిక వ్యవస్థలో అనేక సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్ సింగ్1991 అక్టోబరులో మొదటిసారిగా  అస్సాం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1991 నుండి 1996 వరకు నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు . 2004 నుండి 2014 వరకు రెండు పర్యాయలు దేశ ప్రధానిగా సేవలందించారు. 

ఇటీవల  ప్రధాని నరేంద్ర మోడీ ఎగువ సభ సభ్యునిగా ఆయన పాత్రను కొనియాడారు. మన్మోహన్ సహకారాన్ని ఎప్పటికీ మరచిపోలేరని అన్నారు. మన్మోహన్ సింగ్ కొన్నిసార్లు వీల్ చైర్‌పై ఉండి కూడా ఓటు వేయడానికి వచ్చి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని కొనియాడారు.  2024 ఏప్రిల్ 3న 91 ఏళ్ల మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం పూర్తి కానుంది. ఇక  కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తొలిసారిగా రాజస్థాన్ నుంచి ఎగువసభలో అడుగుపెట్టనున్నారు.

1932 సెప్టెంబరు 26 లో పంజాబ్ (ఇప్పటి చక్వాల్, పాకిస్తాన్) లో ఒక కోహ్లీ కుటుంబములో జన్మించారు.  1958 లో గురుశరణ్ కౌర్‌ను  వివాహమాడిన మన్మోహన్ సింగ్  కు ముగ్గురు కుమార్తెలు. వాళ్ళు ముగ్గురూ మతాంతర వివాహాలే చేసుకోవడం విశేషం. 

మన్మోహన్ సింగ్ సింగ్ మొదటిసారిగా 1991 లో అస్సాం రాష్ట్ర శాసనసభ ద్వారా రాజ్యసభకు ఎన్నికయ్యారు.  ఆ తరువాత 1995, 2001, 2007, 2013లో  ఐదు సార్లు అక్కడినుంచే రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చారు. 1998 నుండి 2004 వరకు, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు  రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 1999లో దక్షిణ ఢిల్లీ నుంచి లోక్‌సభకు పోటీ చేసినా గెలవలేకపోయారు.