
- పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియట్ ఎదుట మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని నిరసిస్తూ, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు చేయాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఒక ప్రకటనలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సెక్రటేరియట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టడమేంటని, వెంటనే రేవంత్ రెడ్డి తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని, లేదంటే తెలంగాణ ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు తరలిస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో ఆ తల్లి విగ్రహం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేవలం ఢిల్లీ బాసుల మెప్పు కోసమే తెలంగాణను ఆత్మను రేవంత్ తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు.