
ముస్తాబాద్, వెలుగు : తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా తెలిసింది. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పెద్దూరి బలరాం గౌడ్(51) సోమవారం సాయంత్రం తాటి కల్లు గీయడానికి వనానికి వెళ్లాడు. రాత్రి అయినా అతను ఇంటికి పోలేదు.
కుటుంబ సభ్యులు సమీప గ్రామాలతో పాటు తాటివనంలో కూడా వెతికారు. మంగళవారం ఉదయం తోటి గీత కార్మికులు తాటి చెట్టు వద్ద బలరాం డెడ్ బాడీ పడి ఉండటం చూసి కుటుంబ సభ్యులకు తెలిపారు. కల్లు గీసే క్రమంలో ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడి మృతి చెందినట్లుగా గుర్తించిన గీత కార్మికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వెళ్లారు. మృతుడి కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్ కానిస్టేబుల్ భూమయ్య తెలిపారు.