
- కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి నాటకంలో భాగంగానే నోటీసులిచ్చారు
- ఇలా ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం
- రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తున్నదని కామెంట్
నల్గొండ, వెలుగు: కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి నాటకంలో భాగంగానే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా అవి దూదిపింజల్లా ఎగిరిపోతాయని అన్నారు. కాళేశ్వరంపై నోటీసులను ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. బుధవారం నల్గొండలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జిల్లా శంకర్ వివాహానికి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమీషన్లేనిదే పాలన చేయడం లేదని, ప్రజాపాలన.. కమీషన్ల పాలనగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ వి అన్నీ చిల్లర ప్రయత్నాలు మాత్రమేనని, ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. గత 17 నెలలుగా పాలన చేతకాక ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతున్నదని విమర్శించారు. కమిషన్ లేనిదే పనులు జరగడం లేదని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే చెబుతున్నారని అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోతే.. మృతదేహాలను బయటకు తీసే తెలివి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కమిషన్ల అరాటంతో మృతదేహాలను వెలికితీయడానికి సైతం సాహసం చేయలేకపోయారని మండిపడ్డారు.
న్యాయమే గెలుస్తుంది
నల్గొండలో సుంకిశాల ప్రాజెక్ట్ కూలినా.. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని, ప్రజా సమస్యలపై కాకుండా ఎంక్వైరీలు, నోటీసులు అంటూ డైవర్షన్లపై దృష్టి పెట్టాయని విమర్శించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం ఇదని ఫైర్ అయ్యారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నా.. ఆడపడుచులకు తులం బంగారం ఏమైంది? రూ.4 వేల పింఛన్ఏమైంది?” అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని అన్నారు. చట్టాలు, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని తెలిపారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మమే గెలుస్తాయని చెప్పారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.