
- అవి రాష్ట్ర సగటు కంటే ఎక్కువ ఉంటున్నాయని వెల్లడి
- టెన్త్, ఇంటర్, ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన స్టూడెంట్లకు పురస్కారాలు ప్రదానం
హైదరాబాద్, వెలుగు: సమాజంలో ట్రైబల్స్ అంటే చిన్నచూపు ఉండేదని, అనాగరికులు అనే ముద్ర వేశారని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని మంత్రి సీతక్క అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్లతో గిరిజన విద్యార్థులు పోటీ పడుతూ ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని చెప్పారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమ్రంభీమ్ ఆదివాసీ భవన్‌లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అకడమిక్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
టెన్త్, ఇంటర్, ఎంసెట్‌లో ప్రతిభ కనబరిచిన ఎస్టీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ స్కూల్ స్టూడెంట్లకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం వాళ్లతో కలిసి లంచ్ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. గిరిజన విద్యాసంస్థల్లో మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పారు. టెన్త్, ఇంటర్, ఎంసెట్‌లో రాష్ట్ర సగటు కంటే గిరిజన విద్యాసంస్థల్లోనే పాస్ పర్సంటేజీ ఎక్కువగా ఉందన్నారు.
ముఖ్యంగా ట్రైబల్స్ ఎక్కువగా ఉండే ములుగు, ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాలు ముందున్నాయని తెలిపారు. “ఒకప్పుడు గిరిజనులను చిన్నచూపు చూశారు. అక్షరానికి దూరం చేసి అనాగరికలుగా ముద్ర వేశారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రైవేట్ విద్యార్థులతో గిరిజన విద్యార్థులు పోటీ పడుతున్నారు” అని అన్నారు. తమ సర్కార్ గిరిజనుల విద్యపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని, అందుకే ఉత్తీర్ణత శాతం పెరిగిందని పేర్కొన్నారు. గత పదేండ్లుగా ఐటీడీఏలు నిర్వీర్యమయ్యాయని, వాటిని బలోపేతం చేస్తున్నామన్నారు.
మూస పద్ధతిలో చదువు చెప్పొద్దు..
టీచర్లు మూస పద్ధతిలో చదువులు చెప్పొద్దని మంత్రి సీతక్క సూచించారు. విద్యార్థులకు డిమాండ్ ఉన్న కోర్సులు నేర్పించాలన్నారు. ‘‘ఆదివాసీలు, గిరిజనులు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాలి. సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాలి. గిరిజన విద్యాసంస్థల్లో బోధిస్తున్న ఇతర వర్గాల టీచర్లు.. తమ సంస్కృతీ సంప్రదాయాలను గిరిజన విద్యార్థులపై రుద్దవద్దు. చదువుతో పాటు ఆదివాసీ గిరిజన సంప్రదాయాలు నేర్పించాలి. గిరిజనులు తమ అస్థిత్వం కోల్పోతే, అది ఉనికికే ప్రమాదమవుతుంది. ఎంత ఎత్తుకు ఎదిగిన మూలాలను మరవొద్దు” అని అన్నారు.
గిరిజనులమని చెప్పుకోవడానికి ఎవరూ భయపడొద్దని.. ఈ వర్గం నుంచి ఎంతోమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. చదువుకోవడంతోనే తాను ఈ స్ధాయికి చేరుకున్నానని, డబుల్ పీహెచ్‌డీ కోసం ఇటీవల ఎంట్రెన్స్ రాశానని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కార్పొరేషన్ల చైర్మన్లు బెల్లయ్య నాయక్, తిరుపతి, ట్రైబల్ శాఖ సెక్రటరీ శరత్, ఎస్టీ గురుకులాలసెక్రటరీ సీతాలక్ష్మి, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.