
- 1.65 కిలోలు పట్టివేత
గద్వాల, వెలుగు: మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొచ్చి గద్వాలలో విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గద్వాల టౌన్ ఠాణాలో డీఎస్పీ మొగులయ్య వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన బాషామియా, అయిజకు చెందిన పూర్ణ అంబదాస్, చాకలి పరశురాముడు మహారాష్ట్ర నుంచి రైలులో గంజాయి తీసకొచ్చి ఇక్కడ 6 గ్రాముల ప్యాకెట్‌ను రూ.500కు అమ్ముతున్నారు. మంగళవారం గద్వాల రైల్వే స్టేషన్ దగ్గరలోని బ్రిడ్జి కింద విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
1.65 కిలోల గంజాయి, 3 ఫోన్లు స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఎస్సై కల్యాణ్‌కుమార్, కానిస్టేబుళ్లు చంద్రయ్య, వీరేశ్, కిరణ్ ను అభినందించారు. సీఐ శ్రీను, రెండో ఎస్సై సతీశ్‌కుమార్ రెడ్డి, మూడో ఎస్సై జహంగీర్ తదితరులున్నారు.
మక్తల్ లో మరో ముగ్గురు..
మక్తల్, వెలుగు: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. మక్తల్–నారాయణపేట రోడ్డులోని నవోదయ వెంచర్ లో మంగళవారం గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. మక్తల్ మండలం కర్ని గ్రామానికి చెందిన భానుప్రసాద్ గౌడ్, నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం చర్ల ఇటిక్యాలకు చెందిన నీరిడి సాయిరాం, తాడూరు మండలం చర్ల ఇటిక్యాలకు చెందిన మంథని సాయికుమార్ ను పట్టుకున్నారు. 150 గ్రాముల గంజాయి, రూ.5 వేలు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకొని, వారిని అరెస్ట్‌చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.