
ఒక స్టార్ హీరోతో సినిమా షూటింగ్ చేయడం అంత సులుభం కాదన్నారు ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కలిసి తాను తెరకెక్కించిన 'సికిందర్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయంపై ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు . సల్మాన్ ఖాన్ షూటింగ్ కి వచ్చే సమయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. లేటెస్ట్ గా ఓ ఇంటర్యూలో మురుగదాస్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సాధారణంగా తెల్లవారుజామునే మేము షూటింగ్ మొదలుపెడతాం. కానీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మాత్రం రాత్రి 8 గంటల తర్వాతే సెట్ కి వచ్చేవారని మురుగదాస్ తెలిపారు. దాంతో పగలు తీయాల్సిన సన్నివేశాలను కూడా రాత్రి వరకు షూట్ చేయాల్సి వచ్చేదని వెల్లడించారు. ఒక సన్నివేశంలో నలుగురు పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వస్తున్నట్లు చూపించాలి. కానీ మేము ఈ సీన్ ను రాత్రి 2 గంటలకు తీశాం. అప్పటికే ఆ పిల్లలు బాగా అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు. దీంతో అలాంటి సీన్స్ అనుకున్న విధంగా వచ్చేవి కాదని మురుగన్ వివరించారు.
నిజానికి 'సికిందర్' సినిమా కథ చాలా ఎమోషనల్ తో కూడుకున్నది. భార్య చనిపోయిన తర్వాత ఆమె అవయవాలను ముగ్గురు వ్యక్తులకు దానం చేస్తారు. అప్పుడు అతను.. తన భార్య కోసం తాను చేయలేకపోయిన పనులను వారి ద్వారా తాను తీర్చుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ఒక గ్రామం మొత్తం ఆయనతో స్నేహం చేస్తుంది. కథలో ఇంత భావోద్వేగంతో కూడిన సెంటిమెంట్ ఉన్నా.. దానిని నేను సరిగ్గా తెరకెక్కించలేకపోయానని ముురుగదాస్ తన నిరాశను వ్యక్తం చేశారు.
గతంలో అమీర్ ఖాన్ నటించిన 'గజిని' చిత్రం విజయానికి, సల్మాన్ ఖాన్ నటించిన 'సికిందర్' మూవీ పరాజయానికి మధ్య తేడాను కూడా మురుగదాస్ వివరించారు. 'గజిని' ని రీమేక్ చేయడం వల్ల దాన్ని బాగా తెరకెక్కించగలిగాను. కానీ 'సికిందర్' విషయంతో కథ ఒరిజినల్ కాబట్టి, దానిపై తనకు పూర్తిగా పట్టులేదని దర్శకుడు తెలిపారు. అయితే తాను బాలీవుడ్ చిత్ర పరిశ్రమను వదిలి వెళ్లనని, తనకు నచ్చిన కథ దొరికితే తప్పకుండా మళ్లీ హిందీలో మూవీ చేస్తానని మురుగదాస్ స్పష్టం చేశారు.
'సికందర్' చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన రష్మికా మందన్న, సత్యరాజ్, షర్మన్ జోషి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 29న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అభిమానుల అంచలనాలను తారుమారు చేసింది.