న్యూఢిల్లీ: పేరు మోసిన గ్యాంగస్టర్, ఆర్‌జేడీ మాజీ ఎంపీ షహబుద్దీన్(53) ఆదివారం కరోనాతో మృతి చెందారు. తిహార్ జైలులో ఉన్న ఆయనకు కరోనా సోకడంతో నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే చికిత్స ఫలించక ఇవాళ కన్నుమూశారు. కరోనా పరీక్ష చేశాక పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమించడంతో రెండు రోజుల క్రితం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సరైన ఆక్సిజన్ నిల్వలు లేక.. వైద్య చికిత్స దైవాధీనంగా మారిన క్రమంలో మహమ్మద్ షహబుద్దీన్ కరోనా కాటుకు గురై తుదిశ్వాస విడిచారు. జంట హత్యల కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న ఆయన 11 ఏళ్లు జైల్లో ఉన్నారు. 2016లో బెయిలుపై బయటకు వచ్చినా బీహార్ రాజకీయ పరిణామాలతో మళ్లీ జైలుకు పంపారు.
