మావోలు కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్ హతం

మావోలు కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్ హతం

ములుగు జిల్లాలో కిడ్నాప్ కు గురైన మాజీ సర్పంచ్ ను మావోయిస్టులు హతమార్చారు. పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పనిచేస్తున్నాడనే కారణంతో చంపేసినట్లు మావోలు లేఖ విడుదల చేశారు. ఛత్తీస్ గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని అడవుల్లో రమేష్ ను హతమార్చినట్లు మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు. 

ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురుసం రమేష్ ను మావోలు సోమవారం సాయంత్రం కిడ్నాప్ చేశారు. డబ్బులకు ఆశపడి రమేష్ పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పనిచేస్తున్నాడని మావోలు లేఖలో తెలిపారు. అటు పోలీసులకు ఇన్ ఫార్మర్ గా ఉంటూనే.. మావోలకు సానుభూతిపరునిగా నటించి మోసం చేశాడని పేర్కొన్నారు. ఓ సారి రమేష్ ను పాలపొడి తీసుకురమ్మన్నామని.. ఆ విషయం వెంకటాపురం ఎస్సైకి చెప్పడంతో.. పాలపొడిలో విషం కలిపారని మావోలు తెలిపారు. ఆ పాలపొడి వల్ల కొంతమంది మావోలు అనారోగ్యం బారినపడ్డారని, మ్యాదరి బిక్షపతి అలియాస్ విజేందర్ అమరుడయ్యాడని తెలిపారు. అంతేకాకుండా ఒక ఎన్ కౌంటర్ కు కూడా రమేష్ కారణమని.. అందుకే అతన్ని కిడ్నాప్ చేసి చంపామని మావోయిస్టులు లేఖలో రాశారు.

కాగా.. తన భర్త కిడ్నాప్ తో ఆయన భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. మంగళవారం ఒక వీడియో విడుదలచేసిన విషయం తెలిసిందే. కాగా.. తన భర్త రమేష్ కు ఎలాంటి హాని తలపెట్టకుండా విడిచి పెట్టాలని మావోలను కోరింది. తన పిల్లల మొహం చూసి అయినా తన భర్తను విడిచిపెట్టాలని అభ్యర్థించింది. అయినా కూడా మావోలు కనికరించలేదు.

For More News..

చేత కాకపోతే చేతులు ఎత్తేయండి.. మేం చూసుకుంటాం

అవసరమైతే నైట్​ కర్ఫ్యూ పెట్టండి