పెండింగ్ బిల్లులు చెల్లించి.. ఎన్నికలు నిర్వహించాలి : జేఏసీ అధ్యక్షుడు యాదయ్య

పెండింగ్ బిల్లులు చెల్లించి.. ఎన్నికలు నిర్వహించాలి : జేఏసీ అధ్యక్షుడు యాదయ్య
  • మాజీ సర్పంచ్​ల సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదయ్య డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్​బిల్లులు చెల్లించిన తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని మాజీ సర్పంచ్​ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్​ చేశారు. 2019–2024 మధ్య రాష్ట్రంలోని పలువురు సర్పంచులు గ్రామాల అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారన్నారు. 

ఎన్నో జాతీయ అవార్డులు కూడా సాధించారని గుర్తుచేశారు. కానీ, గ్రామాలను అభివృద్ధి చేసిన మాజీ సర్పంచులు అప్పులతో బాధపడుతూ జీవన్మరణ స్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లుగా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 450 హామీల్లో 10 కూడా అమలు కాలేదని పేర్కొన్నారు. 

రెండేండ్లుగా గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మూడునాలుగు నెలలుగా జీతాలు రావడం లేదన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు కోల్పోవాల్సివస్తుందనే ఉద్దేశంతోనే ఎన్నికలు నిర్వహిస్తుందని విమర్శించారు.