
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. విచారణకు సహకరిస్తున్నప్పటికీ సిట్ అధికారులు తనను అకారణంగా వేధింపులకు గురిచేస్తున్నారని కోర్టుకు తెలిపినట్టు సమాచారం. ఇప్పటికే ఏడు సార్లు సిట్ ముందు హాజరైనట్టు తన పిటిషన్‌లో పేర్కొన్నట్టు తెలిసింది. మరోవైపు ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఆగస్ట్ 4న విచారణకు రానుంది. ఈ క్రమంలోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీంతో ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిట్ అధికారులు అవసరమైన న్యాయసలహాలు తీసుకుంటున్నారు. ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఓ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. సిట్ దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు.