
- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: విద్యతో పాటు క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. మోటకొండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఖోఖో టోర్నమెంట్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో యువతలో దాగి ఉన్న టాలెంట్‌ను వెలికితీయడం కోసం ప్రభుత్వం ఇటీవల సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహించిందని తెలిపారు.
గ్రామీణ యువతలోని నైపుణ్యాన్ని బయటకు తీసి క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. క్రీడాకారులకు ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని, బీర్ల ఫౌండేషన్ తరఫున ఎలాంటి ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.