
- నల్గొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు మరో సంచలన తీర్పు
నల్గొండ అర్బన్, వెలుగు: మైనర్ బాలికపై అత్యాచారం, పోక్సో కేసులో 60 ఏళ్ల వృద్ధుడికి 23 ఏండ్ల జైలుశిక్ష, రూ.40 వేల జరిమానా విధిస్తూ నల్గొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి రోజా రమణి మంగళవారం మరో సంచలన తీర్పు ఇచ్చారు. ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య, ఓ గ్రామానికి చెందిన నాల్గవ తరగతి చదువుతున్న 10 ఏళ్ల మైనర్ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు.
2023, మార్చి 29 న నల్గొండ రూరల్ పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయగా.. ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసులను నమోదు చేశారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వాదనల తర్వాత నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. కేసులో సరైన సాక్ష్యాధారాలను సేకరించి నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. పోక్సో యాక్ట్ కింద 19 కేసుల్లో 20 మంది నిందితులకు న్యాయస్థానం జైలుశిక్ష, జరిమానా విధించిందని, ఎవరైనా మైనర్ బాలికలపై ఆత్యాచారాలకు పాల్పడితే ఎప్పటికైనా శిక్షలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవార్
హెచ్చరించారు.