
వెలుగు: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారికి ఊరట లభించింది. సింగిల్ జడ్జి వద్ద ఉన్న కేసు విచారణను నిలిపివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఆదేశాలిచ్చింది. కోమటిరెడ్డి, సంపత్ లను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని ఏకగ్రీవంగా సభ నిర్ణయం తీసుకుందని, వారిద్దరి బహిష్కరణ చెల్లదన్న కేసులో సింగిల్ జడ్జి విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కుమార్ వాదించారు. ఇప్పటికే న్యాయశాఖ, అసెంబ్లీ కార్యదర్శులు నిరంజన్ రావు, నర్సింహాచార్యులు, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎస్పీలు రంగనాథన్, రెమా రాజేశ్వరిలకు స్టే లభించినట్లు ఆయన గుర్తు చేశారు. శరత వాదనతో ఏకీభవించిన డివిజన్ బెంచ్ మధుసూదనాచారి విచారణపై స్టే ఇచ్చింది.