6 నెలల్లో 68 రూపాయలు పెరిగిన ప్యారాచూట్ కోకొనట్ ఆయిల్ : GST తగ్గిస్తారని వీళ్లకు ముందే తెలుసా?

6 నెలల్లో 68 రూపాయలు పెరిగిన ప్యారాచూట్ కోకొనట్ ఆయిల్ : GST తగ్గిస్తారని వీళ్లకు ముందే తెలుసా?

హైదరాబాద్, వెలుగు : జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రభుత్వానికి పన్ను ఆదాయం తగ్గనుండగా, ఆ ప్రయోజనం నేరుగా ప్రజలకు దక్కుతుందా? లేదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రాలు ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తెచ్చినప్పటికీ పలు కంపెనీలు చేస్తున్న ప్రకటనలు ఇందుకు ఊతమిస్తున్నాయి. సిమెంట్​పై జీఎస్టీని ప్రభుత్వం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఒక్కో సిమెంట్ బస్తాపై 10 శాతం రేట్లు తగ్గితే ఆ మేరకు వినియోగదారునికి కలిసివస్తుంది. దీని వల్ల నిర్మాణ రంగానికి ఊతమిచ్చినట్లు అవుతుందని సర్కారు భావించింది. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ సిమెంట్ రేట్లు తగ్గించేది లేదని ఫ్యాక్టరీల యజమానులు ఇప్పటికే ప్రకటించాయి. 

హెల్త్ పాలసీలు, వాహనాల రేట్ల విషయంలోనూ ఇదే వ్యూహం అనుసరించాలని ఆయా కంపెనీలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీల ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గితే వినియోగదారునికి ఫలితం ఉండదు. గతంలో జీఎస్టీ రేట్లు తగ్గించినప్పుడు కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. దీనికితోడు స్లాబుల మార్పుపై అనేక కంపెనీలకు ముందే సమాచారం లీక్​కావడంతో తమ ఉత్పత్తుల రేట్లను గడిచిన 6 నెలల్లో పెంచుకున్నాయని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. అందువల్ల ఇప్పుడు జీఎస్టీ తగ్గినా, ఆమేరకు తమ వస్తువుల ధరల్లో మార్పు లేకుండా చూసుకుంటున్నారని వివరిస్తున్నారు. గతంలో జీఎస్టీ తగ్గినప్పటికీ వినియోగదారులకు పెద్దగా లాభం చేకూరలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందనే ఆందోళనలున్నాయి. 

6 నెలల్లో భారీగా పెరిగిన ధరలు

ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను నాలుగు నుంచి రెండుకు కుదిస్తోందని, దీని వల్ల చాలా వస్తువుల రేట్లు తగ్గించాల్సి ఉంటుందన్న సమాచారం కేంద్రం స్థాయిలో ముందే లీకైనట్లు చెప్తున్నారు. దీని వల్ల కంపెనీలు అలర్ట్​అయి, ఇప్పటికే రేట్లు పెంచాయంటున్నారు. గత 6 నెలల్లో కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా ఉంది. ఎగ్జాంపుల్ ప్యారాచూట్ కొబ్బరినూనె 300 ఎంఎల్ డబ్బా తీసుకుంటే.. 6 నెలల క్రితం 130 రూపాయల దగ్గర ఉంటే.. ఇప్పుడు అది 190 రూపాయల వరకు ఉంది. అంటే ఆరు నెలల్లోనే దాదాపు 68 రూపాయల ధర పెరిగింది. 

పన్నులు తగ్గించడం వల్ల ప్రజల మీద భారం తగ్గించాలని సర్కారు భావిస్తుంటే, కంపెనీల స్వార్థంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కార్ల పరిశ్రమలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. గతంలో చిన్న కార్లపై జీఎస్టీ రేట్లను ప్రభుత్వం తగ్గించినప్పుడు, కొన్ని కార్ల తయారీ కంపెనీలు మాత్రం ధరలను  తగ్గించలేదు. దీనికి కారణం ఉత్పత్తి వ్యయం, డీలర్ కమీషన్లు, ఇతర పన్నులు వంటి అంశాలను సాకుగా చూపించాయి. చివరికి, జీఎస్టీ తగ్గింపుతో వచ్చిన లాభం వినియోగదారులకు బదులుగా డీలర్ల కమీషన్ల రూపంలో, లేదా కంపెనీల జేబుల్లోకి వెళ్లిపోయింది.