తెలంగాణలో 5 లక్షల 35 వేల ఎకరాల అటవీ భూములు కబ్జా.!

తెలంగాణలో  5 లక్షల 35  వేల ఎకరాల అటవీ భూములు కబ్జా.!

 

  • తెలంగాణలో అటవీ విస్తీర్ణం 66.87 లక్షల ఎకరాలు 
  • ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి జిల్లాల్లో ఎక్కువ ఆక్రమణలు 
  • వివాదాలు, పోడు సాగు, పల్లెలు, పట్టణాల విస్తరణ ప్రధాన కారణాలు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో అటవీ భూముల విస్తీర్ణం తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వం అటవీ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నా.. ఆక్రమణలకు అడ్డుకట్ట పడటం లేదు.  రాష్ట్రంలోని 66.87 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూములు ఉండగా.. అందులో 5.35 లక్షల ఎకరాల వరకు కబ్జాకు గురయ్యాయి. అంటే.. అటవీ విస్తీర్ణంలో దాదాపు 8 శాతం భూమి అక్రమార్కుల చేతిలోకి వెళ్లింది.  ఇందులో అటవీశాఖ ఇప్పటి వరకు 90 వేల ఎకరాల భూమిని మాత్రమే తిరిగి స్వాధీనం చేసుకున్నది. అడవుల విస్తీర్ణం అధికంగా ఉన్న ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్కువగా భూములు ఆక్రమణకు గురయ్యాయి.  ఈ మూడు జిల్లాల్లోని అటవీ ఆక్రమణలు రాష్ట్రంలోని మొత్తం ఆక్రమిత భూమిలో సగం ఉన్నాయి. 

ఆర్వోఎఫ్​ఆర్​ కింద 6.69 లక్షల ఎకరాలు  

ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్​ హయాంలో రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ (ఆర్వోఎఫ్​ఆర్​)చట్టం కింద దాదాపు 6.69 లక్షల ఎకరాలు కేటాయించారు. 1980కి ముందు డీ-నోటిఫై చేయని భూములు, అటవీ, రెవెన్యూశాఖల మధ్య వివాదాస్పదంగా ఉన్న ప్రాంతాలు, అడవుల్లోకి విస్తరించిన గ్రామాలు, పట్టణాలతో  అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయి.  అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం కొరవడటం, భూయాజమ్యానంపై క్లారిటీ లేకపోవడం, గిరిజనులు, ఆదివాసీలతోపాటు ఇతర వర్గాలవారు జీవనోపాధి కోసం పోడుసాగు కోసం అటవీ భూములను ఆక్రమిస్తున్నారు. ఆర్వోఎఫ్ఆర్​ చట్టం కింద కొంత భూమి కేటాయించినా.. ఈ సమస్యకు ఇంకా ఫుల్​స్టాప్​ పడటం లేదు. ధరణి స్థానంలో భూ భారతి వచ్చినా.. అటవీ భూముల యాజమాన్య హక్కులపై స్పష్టత లేకపోవడంతో ఆక్రమణల పర్వం కొనసాగుతుందని, ఫలితంగా అటవీ భూముల విస్తీర్ణం తగ్గిపోతుందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు.  

గతం కంటే తగ్గిన ఆక్రమణలు.. 

2023లో దాదాపు 7 లక్షల ఎకరాల అటవీ భూములు ఆక్రమణలకు గురికాగా.. ప్రస్తుతం 5.35 లక్షల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. అంటే గతంతో పోలిస్తే  కొంచెం తగ్గింది. పెద్ద మొత్తంలో అటవీ భూమి ఇంకా అక్రమణదారుల స్వాధీనంలోనే ఉంది. చిన్న అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాల్లో ఆక్రమణల శాతం అధికంగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో 88,993 ఎకరాలు, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 79,846 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెంలో 76,052 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. వీటితోపాటు జయశంకర్ భూపాలపల్లి 35,819 ఎకరాలు, ములుగు 34,749 ఎకరాలు అక్రమార్కుల చెరలోకి వెళ్లాయి.  సూర్యాపేట జిల్లా తన అటవీ భూమిలో 24 శాతం, సంగారెడ్డి 20 శాతం కోల్పోయింది.  హైదరాబాద్, హనుమకొండ, జనగామ, కరీంనగర్ వంటి పట్టణ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉండటంతో  ఇక్కడ పెద్దగా 
ఆక్రమణలు లేవు. 

కఠిన చర్యలు తీసుకుంటం

ఆక్రమణదారుల నుంచి భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కొత్త ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. ఇందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు సహకరించాలన్నారు. అటవీ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించనున్నట్లు పేర్కొన్నారు.