
ఒకవైపు అందరూ వినాయక నిమజ్జనాల్లో కోలాహలంగా గడుపుతుండగా.. ఆ కుటుంబంలో మాత్రం విషాదం నిండింది. కిరణా షాపులో ఉండగా పాము కాటేయడంతో బాలిక మరణించిన ఘటన కరీంనగర్ జిల్లాలో శుక్రవారం (సెప్టెంబర్ 05) చోటు చేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో పాము కాటేయడంతో దీప్తిక(12) అనే బాలిక మృతి చెందింది. తన తండ్రి రవీందర్ నిర్వహిస్తున్న కిరాణ షాప్ లో ఉండగా.. దీప్తిక కుడికాలిపై పాము కాటేసింది.
పాము కాటేయడంతో మంటతో దీప్తిక ఆందోళన చెందుతుండగా.. గమనించిన ఆమె అక్క దర్శిక కేకలు వేయడంతో తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే నగునూరులోని ప్రతిమ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ దీప్తిక చనిపోయింది. ఎంతో ఉత్సాహంగా ఉండే కూతురు చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.