
తమిళనాడులో ఫ్యాక్షన్ టైప్ రాజకీయ కుట్రలు వెలుగు చూశాయి. ప్రత్యర్థి పార్టీ నాయకుణ్ని టార్గెట్ చేస్తూ నాటు బాంబులు విసిరారు దుండగులు. దీంతో బతుకు జీవుడా అంటూ టాయిలెట్ దాక్కోవాల్సి వచ్చింది ఆ నేత.
శుక్రవారం (సెప్టెంబర్ 05) జరిగిన బాంబు దాడి తమిళనాట సంచలనం సృష్టించింది. పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లింది. ప్రభుత్వ వైఫల్యంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని విపక్షాలు ధ్వజమెత్తాయి.
తంజావూరు జిల్లాకు చెందిన టౌన్ పంచాయతీ ప్రసిడెంట్, పత్తలి మక్కల్ కచ్చి (PMK) లీడర్ MA స్టాలిన్ పై జరిగింది ఈ దాడి. గురువారం పార్టీ ఆఫీస్ లో ఉండగా ముగ్గురు వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. నేను టాయిలెట్ లో దాక్కుని లోపలినుంచి లాక్ చేసుకోవడంతో బతికి పోయాను.. లేదంటే చంపేసేవారు.. అంటూ ఘటన గురించి చెప్పాడు ఆ లీడర్.
ఈ దాడిలో స్టాలిన్ తో పాటు ఇళయరాజ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడిలో ఆఫీసు ధ్వంసమైనట్లు తెలిపారు. ఈ దాడి వెనుక ఉన్న కారణం తెలియదని.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పీఎంకే కార్యకర్తల ధర్నా:
ఈ ఘటనపై విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని విమర్శలకు దిగాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని విమర్శించారు. మరోవైపు పీఎంకే కార్యకర్తలు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. టైర్లు కాలుస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని.. డీఎంకే ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని విమర్శించారు.
ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను డీఎంకే కొట్టిపడేసింది. వ్యక్తిగత కక్ష్యల వలన ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని.. భూతద్దంలో పెట్టి చూయించి ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం చేయొద్దని డీఎంకే నేతలు అన్నారు. పోలీసులు సరైన సమయంలో సరైన యాక్షన్ తీసుకున్నారని.. నిందితులను పట్టుకుంటారని అధికార డీఎంకే స్పోక్ పర్సన్ డా.సయీద్ హఫీజుల్లా స్పష్టం చేశారు.