రాష్ట్రంలో బీజేపీకి పవర్ గ్యారెంటీ.. కమలం గూటికి మోత్కుపల్లి

రాష్ట్రంలో బీజేపీకి పవర్ గ్యారెంటీ.. కమలం గూటికి మోత్కుపల్లి

ఢిల్లీ: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు మంగళవారం బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ సుజనాచౌదరి, గరికపాటి రామ్ మోహన్ రావు లు పాల్గొన్నారు.

బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు మోత్కుపల్లి ప్రధాని మోడీ, అమిత్ షా నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతున్నదని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరానన్నారు. రాష్ట్రంలో పార్టీలో ఒక కార్యకర్తలాగా పని చేసి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.  రాష్ట్ర సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. ఆయన దళిత వ్యతిరేకి అన్నారు. రాష్ట్రంలో కుటుంబపాలన , ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారన్నారు. ఎలక్షన్స్ ముందు కొత్త కొత్త పథకాలు తీసుకవస్తారు.. కానీ అవి సరిగ్గా అమల్లోకే రావన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని, కేసీఆర్ ని గద్దె దించడం బీజేపీతోనే సాధ్యమని మోత్కుపల్లి అన్నారు.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థి నాయకుడిగా ఎదిగి… దళితుల కోసము సేవలు చేసిన నర్సింహులుకు చాలా రాజకీయ అనుభవం ఉందని అన్నారు. ఆయన రాకతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం ఆవుతుందన్నారు లక్ష్మణ్.  అమిత్ షాని కలిసి పార్టీ బలోపేతం గురించి చర్చించామని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి  ప్రహ్లాద పటేల్ ను, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ని కలిసామన్నారు. ప్రహ్లాద్ పటేల్ ను సమ్మక సరక్క జాతరకు జాతీయ జాతరగా గుర్తించాలని వినతిపత్రం ఇచ్చామని, జాతరకు రావాలని ఆహ్వానించామని చెప్పారు లక్ష్మణ్.

మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరడం మంచి నిర్ణయమన్నారు కేంద్ర సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి. మోత్కుపల్లి రాకతో తెలంగాణలో బీజేపీ బలపడుతుందన్నారు. దళితుల కోసం నర్సింహులు చాలా సేవలు చేశారని చెప్పారు.