భారత్ లో ఏం జరుగుతుందో ప్రపంచం గమనిస్తోంది

భారత్ లో ఏం జరుగుతుందో ప్రపంచం గమనిస్తోంది

గతంలో పత్రికలు, విద్య, వైద్యం సహా పలు విభాగాలు ఓ మిషన్ కోసం నడిచేవని కానీ ఇప్పుడు కమీషన్ల కోసం నడుస్తున్నట్టుగా ఉందని వెంకయ్యనాయుడు విమర్శించారు. ప్రజల మధ్య ఉండి పనిచేయడమే తనకు ఇష్టమని.. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పటికీ ఆంక్షలు పక్కనబెట్టి దేశం మొత్తం తిరిగినట్లు తెలిపారు. గుంటూరులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చట్టసభల్లో ఉండేవారు మరింత బాధ్యతగా ఉండాలని.. చట్టసభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిది కాదన్నారు. భాష హుందాగా ఉండాలని, దుర్భాషలు ఆడొద్దని హితవు పలికారు.

భారత్లో ఏం జరుగుతోందని ప్రపంచమంతా గమనిస్తుందని వెంకయ్యనాయుడు తెలిపారు. స్వాతంత్రోద్యమాన్ని గాంధీ ముందుండి నడిపినా.. మిగతా వారి పాత్ర తక్కువేమీ కాదని స్పష్టం చేశారు. చాలామంది పోరాట యోధులకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని అభిప్రాయపడ్డారు. మన మాతృభాషకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉందని.. పరిపాలన తెలుగులో ఉండాలని వెంకయ్య సూచించారు. మాతృభాషలో చదవాలి..ఇంగ్లీషు,  హిందీతో పాటు ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని సూచించారు.