దేశానికి యువతే అతిపెద్ద సంపద: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

దేశానికి యువతే అతిపెద్ద సంపద: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశానికి అతిపెద్ద సంపద మన యువతే అని, ఈ శక్తిని సరైన మార్గంలో పెట్టాలంటే ప్రతి విద్యార్థి 4డీ సూత్రాన్ని తప్పక పాటించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ లోని  మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జాన్సన్స్ పబ్లికేషన్స్ నిర్వహించిన టాలెంటోత్సవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 అంకితభావం, డిజిటల్ వ్యసనాలకు దూరం, క్రమశిక్షణ,  బహుముఖ ప్రజ్ఞ అనే 4డీ సూత్రాలను యువత పాటించాలన్నారు. సంస్కారం, విలువలు లేని చదువు వ్యర్థమని, అది సమాజానికి మేలు చేయదన్నారు. పిల్లలకు పాఠశాల విద్య ఎంత ముఖ్యమో, కళలను నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యమన్నారు. సూర్యోదయానికి ముందే లేవడం, సూర్యాస్తమయం తర్వాత త్వరగా భోజనం ముగించడం, ఇంట్లో వండిన తాజా ఆహారం, సిరిధాన్యాలు తినడం అలవాటు చేసుకోవాలని వెంకయ్య పిలుపునిచ్చారు.