
- ఇంటింటికి తిరిగి రైతులను అదుపులోకి తీసుకున్నరు
- గట్టు పోలీస్ స్టేషన్‌కు 40 మంది తరలింపు
- ఊళ్లోకొచ్చే దారుల్లో బారికేడ్ల ఏర్పాటు
- బలవంతంగా రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని ప్లాన్
గద్వాల, వెలుగు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చిన్నోనిపల్లి దగ్గర నిర్మిస్తున్న రిజర్వాయర్ ను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతులు 421 రోజులుగా చేస్తున్న దీక్షలను శనివారం పోలీసులు భగ్నం చేశారు. ఉదయమే గ్రామానికి చేరుకున్న పోలీసులు ఊరంతా జల్లెడ పడుతూ రైతులు ఎక్కడ ఉన్నారో ఆరా తీశారు. గతంలో దీక్షలో పాల్గొన్న, ముఖ్యమైన రైతు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుతో భయాందోళనకు గురైన పలువురు రైతులు, యువకులు ఊరు విడిచి వెళ్లిపోయారు. అనంతరం రిజర్వాయర్దగ్గరకు వెళ్లి రైతుల దీక్షను భగ్నం చేశారు. మొత్తం 40 మంది రైతులను గట్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అందరి దగ్గర సెల్ఫోన్లు లాక్కున్నారు. ఎవరూ ఫోటోలు, వీడియోలు తీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు గ్రామానికి వెళ్లే దారులన్నింటినీ పోలీసులు ఆధీనంలోకి తీసుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ స్టేషన్ల నుంచి 300 మందికి పైగా పోలీసులను తీసుకొచ్చి చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులను పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఐజకు పెద్దఎత్తున పోలీస్ బలగాలను తరలించారు. అక్కడి నుంచి ఆదివారం తెల్లవారుజాముననే రిజర్వాయర్ దగ్గరకు తరలించేలా ప్లాన్ చేస్తున్నారు.
పనులే చేస్తం.. ఊరిని ఖాళీ చేయించం
చిన్నోనిపల్లి గ్రామాన్ని ఖాళీ చేయించబోమని, పెండింగ్‌లో ఉన్న రిజర్వాయర్ పనులు మాత్రమే పూర్తి చేస్తామని గద్వాల ఆర్డీవో రాములు, ఇరిగేషన్ ఈఈ రహీముద్దీన్ చెప్పారు. శనివారం సాయంత్రం ఆర్డీవో ఆఫీస్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. చిన్నోనిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయని, పెండింగ్ పనులు పూర్తి చేయడానికి నిర్వాసిత రైతులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం గతంలోనే రైతులకు పరిహారం కింద రూ. 41.98 కోట్లు చెల్లించామన్నారు. ఇరిగేషన్ ఈఈ రహీముద్దీన్ మాట్లాడుతూ సప్లిమెంటేషన్ రిజర్వాయర్ గా చిన్నోనిపల్లి రిజర్వాయర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ రిజర్వాయర్ కింద మూడు వేల ఎకరాల ఆయకట్టు ఏర్పాటు చేసి ఆర్డీఎస్, నెట్టెంపాడు భూములకు నీరు అందజేసేలా డిజైన్ రూపొందించినట్లు తెలిపారు. ఆర్డీఎస్ కు నీరు రానందున తుమ్మిళ్ల పథకం ఏర్పాటు చేశారని, తుమ్మిళ్ల ద్వారా నీరు పారని పక్షంలో చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ 25 ద్వారా నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే 90 శాతం రిజర్వాయర్ పనులు పూర్తయినందున మిగతా పది శాతం కట్ట గ్యాప్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
ఆయకట్టు లేని రిజర్వాయర్
నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా గట్టు మండల పరిధిలోని చిన్నోనిపల్లి విలేజ్ దగ్గర రిజర్వాయర్ నిర్మించేందుకు 2005లో సర్వే చేశారు. 2006లో 2,650 ఎకరాల భూమిని సేకరించారు. రిజర్వాయర్ లో చిన్నంపల్లి గ్రామానికి చెందిన 251 ఇండ్లు ముంపునకు గురవుతాయని గుర్తించారు. వాటికి గతంలోనే పరిహారం చెల్లించారు. కానీ పనులు మాత్రం మొదలుపెట్టలేదు. ఏండ్లు గడుస్తున్నా పనులు చేపట్టకపోవడంతో ఎలాంటి ఆయకట్టు లేని రిజర్వాయర్ రద్దు చేసి తమ భూములు తమకు ఇవ్వాలని 421 రోజులుగా ముంపునకు గురవుతున్న ఐదు గ్రామాల నిర్వాసితులు దీక్షలు చేస్తున్నారు. కేవలం ఆర్డీఎస్ కు నీళ్లు ఇవ్వాలనే కుట్రలో భాగంగానే ఇక్కడ రిజర్వాయర్ కడుతున్నారని వాపోతున్నారు. గతంలో తమకు రూ. 75 వేల నుంచి రూ. 90 వేల వరకు నష్టపరిహారం ఇచ్చారని, అప్పట్లో పనులు చేయకపోవడంతో తాము మళ్లీ వ్యవసాయం చేసుకుంటున్నామని అంటున్నారు. అసలు ఆయకట్టే లేని ఈ రిజర్వాయర్రద్దు చేసేవరకు పోరాటం సాగిస్తామని రైతులు చెబుతున్నారు.