అధికారులు సూచించిన పంటలే వేయండి..ప్రభుత్వ సూచనలు పాటించాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

అధికారులు సూచించిన పంటలే వేయండి..ప్రభుత్వ సూచనలు పాటించాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు : ఎల్ నినో కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినందున రైతులు ప్రభుత్వం సూచించిన పంటలనే సాగు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజజవర్గంలో గురువారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, సమీక్షల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

 వాతావరణంలో జరుగుతున్న మార్పులను రైతులను అర్థం చేసుకొని, పంటల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు పడకపోతే పరిస్థితి మరింత  క్లిష్టంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వర్షాపాతం, రిజర్వాయర్లలో నిల్వలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తోందన్నారు. 

భవిష్యత్ లో వర్షాలు కురుస్తాయన్న ఆశతో కాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను ప్రామాణికంగా తీసుకొని నీటి విడుదల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం  హుజూర్ నగర్ ఎంపీడీవో ఆఫీస్ లో 178 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఆయన వెంట పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు, ఏఎంసీ చైర్ పర్సన్ రాధిక అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, ఆర్డీవో శ్రీనివాసులు ఉన్నారు.