నందు భార్య చిత్రలేఖను 8 గంటలు విచారించిన సిట్

నందు భార్య చిత్రలేఖను 8 గంటలు విచారించిన సిట్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు కోరె నందకుమార్ అలియాస్ నందు భార్య చిత్రలేఖ సిట్ విచారణ ముగిసింది. ఈ నెల 25న నందకుమార్ భార్య చిత్రలేఖను సిట్ బృందం విచారించింది. అనుమానాలు నివృత్తి కాకపోవడంతో ఇవాళ మరోసారి ఆమెను సిట్ విచారించింది. దాదాపు 8 గంటలు చిత్రలేఖను సిట్ విచారించింది. విచారణ అనంతరం సిట్ కార్యాలయం నుంచి చిత్రలేఖ వెళ్లిపోయింది. స్వామీజీతో దిగిన ఫోటోలు, కాల్ డేటా ఆధారంగా చిత్రలేఖను సిట్ పలు ప్రశ్నలు అడిగింది. రామచంద్ర భారతి, సింహయాజులు, నందుకు ఉన్న సంబంధంపై చిత్రలేఖను ప్రశ్నించిన సిట్.. ఆమె స్టేట్ మెంట్ ను నమోదు చేసుకుంది. 

ఇదే కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా కేరళ ఎన్డీయే కన్వీనర్ తుషార్, డాక్టర్ జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్ లకు  41ఏ సీఆర్పీసీ కింద సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే దీనిపై బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను నిందితుడిగా పేర్కొని నోటీసులు ఇవ్వడం సరికాదని వాదనలు వినిపించారు. తనపై తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేస్తోందని, సంబంధం లేని వ్యవహారంలో తన పేరును ప్రచారం చేస్తున్నారని బీఎల్ సంతోష్ తన పిటిషన్ లో తెలిపారు. సీఆర్పీసీ నోటీసులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు బీఎల్ సంతోకుమార్ కు సిట్ జారీ చేసిన 41 ఏ సీఆర్పీసీ నోటీసులు చట్టపరంగా లేవని.. డిసెంబర్ 5 వరకు  స్టే విధించింది.