బడ్జెట్ 2026: ఈసారైనా క్రిప్టో ఇన్వెస్టర్ల డిమాండ్స్ నిర్మలమ్మ వింటుందా..? కోరికల చిట్టా ఇదే..

బడ్జెట్ 2026: ఈసారైనా క్రిప్టో ఇన్వెస్టర్ల డిమాండ్స్ నిర్మలమ్మ వింటుందా..? కోరికల చిట్టా ఇదే..

ప్రస్తుతం దేశంలో క్రిప్టోకరెన్సీ, వర్చువల్ డిజిటల్ అసెట్స్ రంగం ప్రస్తుతం ఒక కీలక దశలో ఉంది. 2022 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన పన్ను నిబంధనలు ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపాయి. రాబోయే 'బడ్జెట్ 2026' నేపథ్యంలో.. భారతీయ క్రిప్టో ఎక్స్ఛేంజీలు, ఇన్వెస్టర్లు ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమ వర్గాలు ప్రధానంగా మూడు అంశాలపై మార్పులను కోరుతున్నాయి.

మొదటగా.. ప్రతి క్రిప్టో లావాదేవీపై విధిస్తున్న 1 శాతం టీడీఎస్ గురించే. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194S ప్రకారం, జూలై 2022 నుండి అమల్లోకి వచ్చిన ఈ నిబంధన వల్ల దేశీయ ప్లాట్‌ఫారమ్‌లలో ట్రేడింగ్ వాల్యూమ్ భారీగా తగ్గిపోయింది. అధిక టీడీఎస్ కారణంగా ఇన్వెస్టర్లు విదేశీ ప్లాట్‌ఫారమ్‌ల వైపు మళ్లుతున్నారని అన్నారు ముడ్రెక్స్  సీఈఓ ఎదుల్ పటేల్. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గడమే కాకుండా, లావాదేవీల పారదర్శకత కూడా దెబ్బతింటోందన్నారు. ఈ టీడీఎస్‌ను 0.01 శాతానికి తగ్గించడం ద్వారా దేశీయంగా పెట్టుబడులను ప్రోత్సహించవచ్చని కోరుతున్నారు.

రెండవది.. క్రిప్టో లాభాలపై విధిస్తున్న 30 శాతం ఫ్లాట్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్. ప్రస్తుతం లాటరీలు, జూదం ద్వారా వచ్చే ఆదాయంతో సమానంగా క్రిప్టో ఆదాయాన్ని పరిగణించి భారీ పన్ను వసూలు చేస్తోంది. ఇది దీర్ఘకాలిక ఇన్వెస్టర్ల ఉత్సాహాన్ని దెబ్బతీస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇతర ఆస్తులపై ఉన్నట్లుగా.. క్రిప్టోకు కూడా కాలపరిమితి ఆధారంగా పన్ను రాయితీలు ఇవ్వాలని నిపుణులు కోరుతున్నారు. లాభాలపై మాత్రమే పన్ను వేసేలా ఒక ఆచరణాత్మకమైన ఫ్రేమ్‌వర్క్ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు బినాన్స్ ఏపీఏసీ హెడ్ ఎస్‌బీ శేఖర్. ఇది ఇన్వెస్టర్ల పట్ల ప్రభుత్వం చూపుతున్న కఠినమైన వైఖరిని మార్చి, పర్యవేక్షణ దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలిస్తుందని అన్నారు.

ఇక చివరిగా ముఖ్యమైన మూడవ అంశం 'లాస్ సెట్-ఆఫ్' సౌకర్యం లేకపోవటం. ప్రస్తుతం ఒక క్రిప్టో లావాదేవీలో వచ్చిన నష్టాన్ని మరో లావాదేవీలో వచ్చిన లాభంతో సర్దుబాటు చేసుకునే అవకాశం భారతదేశంలో లేదు. ఇది ఇన్వెస్టర్లకు అన్యాయం చేస్తోందని జెబ్‌పే వంటి సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. నష్టాలను భర్తీ చేసుకునే అవకాశం కల్పిస్తేనే అది సమతుల్యమైన పన్ను వ్యవస్థగా మారుతుంది. 

వీటన్నింటికీ మించి క్రిప్టో రంగానికి సంబంధించి స్పష్టమైన నియంత్రణ మార్గదర్శకాలు అవసరం. బడ్జెట్ 2026లో ప్రభుత్వం వీటిపై స్పష్టతనిస్తే.. సంస్థలు బాధ్యతాయుతంగా ప్రణాళికలు రూపొందించుకోవడానికి, నూతన ఆవిష్కరణలు చేయడానికి వీలవుతుందనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ మార్పులు జరిగితేనే భారతదేశం గ్లోబల్ క్రిప్టో మార్కెట్‌లో తన పట్టును నిలుపుకోగలదని నిపుణులు అంటున్నారు. మరింత ట్రాన్స్‌పరెన్సీ కావాలంటే ప్రభుత్వం కూడా ఆర్థిక వాతావరణాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్లాని వారు కోరుతున్నారు.