ఈమె మామూలు మహిళ కాదు. కలిసినప్పుడల్లా మంచిగా మాట్లాడుతూ.. ఆత్మీయతను ఒలకబోస్తూ.. వృద్ధురాలి వివరాలు మొత్తం ఆరాతీసింది. ఒంటరిగా ఉందని తెలిసి జాలి చూపిస్తూనే.. ఆమె దగ్గరున్న బంగారాన్ని ఎప్పుడు కొట్టేయాలా.. అనే ప్లాన్ వేసింది. అందుకోసం ఇద్దరితో ఒప్పందం కుదుర్చుకుని పథకం ప్రకారం దాడి చేశారు. ఒంటరిగా ఉన్న సమయంలో ముఖంపై స్ప్రే చల్లి.. ఆమె ఒంటిమీద ఉన్న పది తులాల బంగారం ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మాన్‌ఘాట్ లో మంగళవారం (జనవరి 06) జరిగింది ఈ ఘటన. పద్మా నగర్ కాలనీ లో ఒంటరిగా నివసిస్తున్న సుగుణ (66) అనే వృద్ధురాలిపై స్ప్రే చేసి సుమారు 10 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు.
వృద్ధురాలికి పరిచయస్తురాలైన సుమిత్ర అనే మహిళ మరో ఇద్దరు భార్యాభర్తల అయిన శివకృష్ణ, సుశీల తో కలిసి ఆమె ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో వృద్ధురాలి ముఖంపై స్ప్రే చేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి చేరింది. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న సుమారు పది తులాల బంగారంతో దుండగులు పరారయ్యారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సరూర్‌నగర్ పోలీసులు సుమిత్ర, సుశీల,శివకృష్ణ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కొడుకు లండన్ లో ఉంటుండటంతో వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. ఇది గమనించిన దుండగులు.. ఆమె ఆస్తులను కొట్టేసందుకు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే బంగారం దొంగిలించి పరారయ్యారు.
