కాలుష్య పరిశ్రమ వద్దే వద్దు.. భిక్కనూరు బంద్ సక్సెస్

కాలుష్య పరిశ్రమ వద్దే వద్దు.. భిక్కనూరు బంద్ సక్సెస్
  • భారీ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ
  • వ్యతిరేకించిన యువత, మహిళలు, గ్రామాల ప్రజలు

కామారెడ్డి: భిక్కనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫ్యూజన్ ఫార్మా విస్తరణ వద్దే వద్దని, పచ్చని పల్లెలను కాలుష్య కాసారాలుగా మార్చవద్దని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఇవాళ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు భిక్కనూరు, కాచాపూర్, బస్వాపూర్, కంచర్ల గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. 

కాలుష్య ఫ్యాక్టరీ  ఏర్పాటును నిరసిస్తూ ఇవాళ భిక్కనూరు బంద్ కొనసాగుతోంది. పోలీసు బందోబస్తు నడుమ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుండగానే అధికారులు, ఫార్మా కంపెనీ యజమానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు తెలిపారు.

కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య పబ్లిక్ హియరింగ్
ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ స్థలం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

భిక్కనూరు శివారులోని ఫ్యూజన్ ఫార్మా హెల్త్ కేర్ వద్ద ఇద్దరు ఏఎస్పీలు, డిఎస్పీలు, జిల్లాకు చెందిన ఏడుగురు సీఐ ఆధ్వర్యంలో బందోబస్తు  ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యేవారు కేవలం ఫార్మా కంపెనీ ఏర్పాటు పై ప్రజాభిప్రాయం మాత్రమే చెప్పాలని పోలీసులు సూచించారు.