కమ్యూనిటీ జాగలనూ అమ్మేస్తున్రు..ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్లు.. అందుబాటులో లేని రికార్డులు

కమ్యూనిటీ జాగలనూ అమ్మేస్తున్రు..ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్లు.. అందుబాటులో లేని రికార్డులు
  • భవిష్యత్ అవసరాలకు స్థలాలు లేక ఇబ్బందులు

నిజామాబాద్​, వెలుగు:  నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లో కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ కోసం కేటాయించిన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. కొత్త వెంచర్లలో 10 శాతం భూమిని పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, ఆలయాల వంటివాటికి వదిలేయాలి.  కానీ ప్లాట్లు అమ్మిన తర్వాత ఆ భూములను విక్రయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

దీంతో కాలనీల అవసరాలకు స్థలాలు లేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. డీటీసీపీ లేఅవుట్‌ అనుమతి కోసం మున్సిపాలిటీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసిన 10 శాతం భూములను రక్షించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాల్లో రిజర్వ్‌ ల్యాండ్‌కు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేకపోవడం వివాదాలకు దారితీస్తోంది. 

పర్మిషన్ల వరకే కేటాయింపులు..

నిజామాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది.  ప్రస్తుతం 40 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. హైదరాబాద్‌ రోడ్‌, ఆర్మూర్‌ రోడ్‌, న్యాల్​కల్‌ రోడ్‌, నాగారం, బైపాస్‌ పరిసరాల్లో 10 నుంచి 15  కిలోమీటర్ల దాకా వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారాయి. నాలా కన్వర్షన్‌ అనంతరం ఎకరం భూమిని ప్లాట్లుగా మార్చాలంటే కనీసం 10 గుంటల భూమిని కమ్యూనిటీ అవసరాల కోసం మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్‌ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్‌ ఆధారంగానే డీటీసీపీ అనుమతి లభిస్తుంది. ఆ పర్మిషన్ రిఫరెన్స్ నంబర్ తోనే రియల్టర్లు కొనుగోలుదారులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్​ చేయాలి.

కమ్యూనిటీ డెవలప్​మెంట్ కోసం కేటాయించిన భూముల్లో మున్సిపాలిటీలు పార్క్​లు, ఆలయాలు, కమ్యూనిటీ హాల్స్ తదితర వాటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.  కానీ రియల్టర్లు వాటిని కూడా ప్లాట్లుగా చూపించి విక్రయిస్తున్నారు. బోర్గాం, మాధవ్‌నగర్‌, మోపాల్‌ రోడ్‌, ఆర్టీసీ కాలనీ, ఏకశిలానగర్‌ ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన కమ్యూనిటీ స్థలాలు అమ్ముడైనట్లు ఆరోపణలు ఉన్నాయి.  కొనుగోలు అనంతరం కాలనీవాసులకు తెలియడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

విలీన గ్రామాల్లో మరీ దారుణం

2019లో నిజామాబాద్ కార్పొరేషన్​లోకి 9 శివారు గ్రామాలు విలీనమయ్యాయి. అప్పట్లో గ్రామపంచాయతీల తీర్మానాలతో వెంచర్‌ మ్యాపులు ఆమోదించుకుని ప్లాట్లు విక్రయించారు. ఆ సమయంలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ కోసం చూపిన రిజర్వ్‌ భూమిని ప్రస్తుతం నాన్‌-లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ పథకం కింద క్రమబద్ధీకరించి అమ్ముతున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.  రికార్డుల లోపం రియల్టర్లకు అనుకూలంగా మారగా, కార్పొరేషన్‌ జోక్యం చేసుకోవడంలో వెనుకడుగు వేస్తోందని స్థానికులు అంటున్నారు.  ఈ క్రమంలో పాంగ్రా బోర్గాం, గూపన్​పల్లి, ముబారక్​నగర్, బోర్గాం (కే), మానిక్​భండార్, న్యాల్​కల్, ధర్మారం, మాధవ్​నగర్​ (బీ) కాలనీ వాసులు రియల్టర్లతో గొడవపడుతున్నారు.  స్థలాలు కాపాడుకునేందుకు బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.   

ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్​లు

కమ్యూనిటీ డెవలప్​మెంట్​ కోసం వదిలిన 10 శాతం ఓపెన్ ల్యాండ్​ను గత పదేండ్లు కింద అప్పటి ప్రజాప్రతినిధి కుల సంఘాలకు కేటాయించాడు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన ప్రజాప్రతినిధి ఆ ల్యాండ్ సమాజం కోసం ఉపయోగించాలని పట్టుబడుతున్నాడు. కమ్యూనిటీ డెవలప్​మెంట్​ భూములకు మున్సిపాలిటీల నుంచి అక్రమంగా ఇంటి నంబర్లు తీసుకొని కొందరు ఇతరులకు రిజిస్ట్రేషన్​లు చేసిచ్చారు. ఇలాంటివి 300 కేసులు ఉన్నట్లు సమాచారం. బోధన్, భీంగల్​లో కూడా ఇదే  పరిస్థితి ఉందని చెబుతున్నారు. గతంలో కొంత భూమిని రాజకీయ అవసరాల కోసం కేటాయించగా, ప్రస్తుతం కొత్త ప్రజాప్రతినిధులు ఆ భూమిని ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలనే పట్టుదలతో ఉన్నారు.   

మొక్కలు నాటిస్తాం..

 పబ్లిక్‌ అవసరాల కోసం రిజిస్ట్రేషన్‌ చేసిన 425 స్థలాలను గుర్తించి జియో-ట్యాగ్‌ చేశాం. అన్ని స్థలాలకు ఫెన్సింగ్‌ వేయడం ఖర్చుతో కూడుకున్నది.  వీటిని కాపాడకపోతే ప్రజల భవిష్యత్ ఇబ్బందుల్లో పడుతుంది. హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటి ఆక్రమణలను అరికట్టే చర్యలు చేపడతాం.- దిలీప్​కుమార్, నగర కార్పొరేషన్ కమిషనర్