కేటీఆర్‌‌కు ఏసీబీ నోటీసులు.. అర్వింద్‌ కుమార్, బీఎల్‌ఎన్‌ రెడ్డిని కూడా విచారించే చాన్స్‌

కేటీఆర్‌‌కు ఏసీబీ నోటీసులు.. అర్వింద్‌ కుమార్, బీఎల్‌ఎన్‌ రెడ్డిని కూడా విచారించే చాన్స్‌
  • ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈ నెల 28న మరోసారి విచారణకు హాజరు కావాలని పిలుపు
  • ఇప్పటికే ఈ ఏడాది జనవరి 9న ప్రశ్నించిన ఏసీబీ
  • అర్వింద్‌ కుమార్, బీఎల్‌ఎన్‌ రెడ్డిని కూడా విచారించే చాన్స్‌

హైదరాబాద్‌‌, వెలుగు: ఫార్ములా ఈ కార్​ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఇందులో  ప్రధాన నిందితుడైన బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌, మాజీ మంత్రి కేటీఆర్‌‌‌‌ను మరోసారి విచారించేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసింది.ఈ మేరకు ఈ నెల 28న ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరుకావాలని సోమవారం నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే జనవరి 9న కేటీఆర్ స్టేట్‌‌మెంట్‌‌ను ఏసీబీ అధికారులు రికార్డ్​ చేశారు. ఆయన ఇచ్చిన సమాచారంతోపాటు కేసు దర్యాప్తులో సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా మరోసారి ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్​ రేసు వ్యవహారంలో రూ.54.89 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది.

జనవరి 9న మొదటిసారి విచారణ
దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది జనవరి 8న సీనియర్‌‌‌‌ ఐఏఎస్‌‌ అర్వింద్‌‌కుమార్‌‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.  ఆ మరుసటి రోజే  జనవరి 9న  కేటీఆర్‌‌ను,10న హెచ్‌‌ఎండీఏ బోర్డ్‌‌ మాజీ చీఫ్ ఇంజినీర్‌‌‌‌ బీఎల్‌‌ఎన్‌‌ రెడ్డిని, అదే నెల18న గ్రీన్‌‌కో ఏస్‌‌ నెక్స్ట్‌‌జెన్‌‌ ఎండీ చలమలశెట్టి అనిల్‌‌కుమార్‌‌ను ఏసీబీ అధికారులు విచారించారు. వీరిచ్చిన సమాచారంతో ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను, సీఈవోను జూమ్‌‌ మీటింగ్‌‌ ద్వారా వర్చువల్‌‌గా ఎంక్వైరీ చేశారు. ఈ కేసులో నిందితులైన అర్వింద్‌‌కుమార్, బీఎల్‌‌ఎన్‌‌ రెడ్డి సహా ఈవెంట్‌‌ ఆర్గనైజర్లు, ఏస్‌‌ నెక్స్ట్‌‌ జెన్‌‌, ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధులు కేటీఆర్‌‌‌‌ పేరునే ప్రధానంగా ప్రస్తావించారు.

వీరిచ్చిన సమాచారం ఆధారంగా ఫార్ములా ఈ రేసు ప్రపోజల్స్‌‌, లండన్ కంపెనీతో సంప్రదింపులు, అగ్రిమెంట్లు, చెల్లింపులకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను ఏసీబీ సేకరించింది. కేసులో ఫిర్యాదుదారుడైన ఎంఏయూడీ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ దానకిశోర్‌‌‌‌, నిందితుడైన స్పెషల్ చీఫ్‌‌ సెక్రటరీ అర్వింద్‌‌కుమార్‌‌‌‌ ఇచ్చిన స్టేట్‌‌మెంట్స్ ఆధారంగా ఏసీబీ అధికారులు కేటీఆర్‌‌‌‌ను ప్రశ్నించారు. ప్రధానంగా ఫార్ములా-ఈ కార్​ రేసు నిర్వహణకు ఎవరు ప్రపోజల్స్ తీసుకువచ్చారు? కారు రేసింగ్‌‌ వల్ల ప్రయోజనం ఏంటి? అనే కోణంలో కేటీఆర్‌‌‌‌ నుంచి వివరాలు సేకరించారు.

ఫార్ములా ఈ కార్​ రేసు లెక్కలు ఇలా
బ్రిటన్‌‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌, హైదరాబాద్‌‌కు చెందిన గ్రీన్‌‌ కో సిస్టర్ కంపెనీ ఏస్‌‌ నెక్ట్స్​ జెన్‌‌, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌‌ అండ్ అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌(ఎంఏయూడీ) మధ్య 2022 అక్టోబర్‌‌25న త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. హుస్సేన్‌‌సాగర్ పరిసరాల్లో సీజన్ 9,10,11,12 కోసం ట్రాక్ నిర్మాణం సహా ఇతర మౌలిక సదుపాయాలను ఎంఏయూడీ కల్పించే విధంగా అగ్రిమెంట్‌‌ చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 11న సీజన్‌‌ 9 నిర్వహించారు. వివిధ కారణాల వల్ల ఏస్ నెక్ట్స్​జెన్​, ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌ మధ్య విభేదాలు తలెత్తాయి.

దీంతో అసెంబ్లీ ఎన్నికల కోడ్‌‌ అమల్లో ఉన్న సమయంలో ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా అక్టోబర్‌‌‌‌ 3,11వ తేదీల్లో హెచ్‌‌ఎండీఏ బోర్డు సాధారణ నిధుల నుంచి ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌‌కు  రూ.45 కోట్ల 71 లక్షల 60 వేల 625 సొమ్మును విదేశీ కరెన్సీలో ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ చేశారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఫారిన్‌‌ ట్రాన్సాక్షన్స్‌‌ జరుగడంతో  ఐటీ శాఖ హెచ్‌‌ఎండీఏకు రూ.8.07 కోట్లు జరిమానా విధించింది. ఈ మొత్తం వ్యవహారంలో హెచ్‌‌ఎండీఏ బోర్డు ఖజానా నుంచి మొత్తం రూ.54 లక్షల 88 వేల 87 వేల 43 దుర్వినియోగం అయ్యాయి.