2023 ఫిబ్రవరి 11న సిటీలో ఫార్ములా ఈ–రేస్

2023 ఫిబ్రవరి 11న సిటీలో ఫార్ములా ఈ–రేస్

హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ-రేస్ జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరిగే ఫార్ములా ఈ రేస్ కు ఇప్పటి నుంచే HMDA ఏర్పాట్లు చేస్తోంది. నెక్లెస్‌రోడ్డులోని 2.7 కి.మీ మార్గంలో ట్రాక్‌ ఏర్పాటు చేస్తున్నారు. తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్‌ గార్డెన్‌లోకి  వెళ్లేవిధంగా ట్రాక్‌ను రూపొందిస్తున్నారు.ఎన్టీఆర్ గార్డెన్‌లో నుంచి వెనక వైపు ఉన్న మింట్‌ కాంపౌండ్‌ మర్రిచెట్టు నుంచి ఐమాక్స్‌ థియేటర్, ఇందిరాగాంధీ విగ్రహం  మీదుగా ఈ ట్రాక్‌ను  ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 17 మలుపులు వచ్చేవిధంగా ట్రాక్‌ ప్లాన్‌ రూపొందించినట్లు తెలుస్తోంది. 

గ్లోబల్ సిటీ గా ప్రమోట్ చేసేందుకే..

హైదరాబాద్ ని గ్లోబల్ సిటీ గా ప్రమోట్ చేసేందుకే ఫార్ములా ఈ-రేసును సిటీలో ఏర్పాటు చేస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ సంతోష్ చెప్పారు. ఫార్ములా ఈ రేస్ డెమో కారును నగరంలో పలు ప్రాంతాల్లో పబ్లిక్ సందర్శనార్థం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కారును ట్యాంక్ బండ్ పై ఇవాళ లాంచ్ చేశారు. రేసును చూడటానికి 30వేల మందికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి చెప్పారు.

గంటకు 180 కి.మీ వేగంతో..

అంతర్జాతీయంగా పేరొందిన పలు ఆటోమొబైల్‌ సంస్థలు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు అంచనా. ఆ సంస్థలు రూపొందించిన ఎల్రక్టానిక్‌ కార్ల సామర్థ్యాన్ని చాటుకొనేందుకు హైదరాబాద్‌ తొలిసారిగా వేదిక కానుంది. ఈ కార్లకు గంటకు 250 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్లే సామర్థ్యం ఉన్నప్పటికీ.. హైదరాబాద్ సిటీలో 180 కి.మీ వరకే పోటీ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.