తనిఖీలతో పబ్లిక్​కు ఇబ్బందులు.. ఎన్నికల సంఘానికి ఎఎఫ్​జీజీ లేఖ

తనిఖీలతో పబ్లిక్​కు ఇబ్బందులు.. ఎన్నికల సంఘానికి ఎఎఫ్​జీజీ లేఖ

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చిన నాటి నుంచి పోలీసులు చేస్తున్న తనిఖీలతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌‌జీజీ) సెక్రటరీ పద్మనాభరెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకటించిన టైమ్ నుంచే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తనిఖీలు చేస్తున్నారన్నారు. నిత్యం వ్యాపారాలు చేసుకునే వాళ్లు, వైన్స్, బంగారం షాపుల వాళ్లు బిజినెస్ పూర్తయి ఇంటికి క్యాష్ తీసుకెళ్లే టైమ్ కూడా పోలీసులు తనిఖీ చేస్తూ ఆ డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

తనిఖీలపై  కేంద్ర ఎన్నికల సంఘం గైడ్ లైన్స్‌‌ ను ఖరారు చేసి ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరారు.  ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌‌కు ఆయన గురువారం లేఖ రాశారు. డబ్బు తీసుకెళ్లేటప్పుడు పేపర్లు లేకుండా ఎంత తీసుకెళ్లాలి, బంగారం ఎంత తీసుకెళ్లాలో ఆదేశాలివ్వాలని లేఖ లో కోరారు.  తనిఖీల్లో పట్టుబడ్డ బంగారం, డబ్బు  ఎన్నికలకు సంబంధించినవా కాదా అని నిర్ధారించటానికి జిల్లా స్థాయిలో అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. పెళ్లిళ్లు, పండుగల టైమ్​లో సాధారణ పబ్లిక్ మనీ, బంగారాన్ని తీసుకెళ్తున్నారని, ఈ తనిఖీలతో పబ్లిక్ ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు.