మూన్​లైటింగ్‌ను సీరియస్​గా తీసుకున్న విప్రో

మూన్​లైటింగ్‌ను సీరియస్​గా తీసుకున్న విప్రో

న్యూఢిల్లీ: ఒకేసారి రెండు జాబ్‌లు చేయడాన్ని (మూన్​లైటింగ్‌ను) విప్రో సీరియస్​గా తీసుకుంది. తమ కంపెనీతోపాటు ఇతర చోట్ల పనిచేయడాన్ని సహించబోమని స్పష్టం చేసింది. ఇలా చేస్తున్న 300 మంది జాబ్స్​ను తీసేశామని విప్రో చైర్మన్​ రిషబ్‌ ​ప్రేమ్​జీ ప్రకటించారు. మూన్​లైటింగ్​ అంటే కంపెనీలను ఉద్యోగులు మోసం చేయడం తప్ప ఏమీ కాదన్న తన కామెంట్స్​కు కట్టుబడి ఉన్నానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తమ ఉద్యోగుల్లో కొందరు  తమ ప్రత్యర్థి కంపెనీల కోసం పనిచేస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య 300 వరకు ఉన్నట్టు మేం గుర్తించామని ఆలిండియా మేనేజ్​మెంట్​ అసోసియేషన్​ నేషనల్​ మేనేజ్మెంట్​ కన్వెన్షన్​లో మాట్లాడుతూ వెల్లడించారు. 

వాళ్లుచేసిన పని కంపెనీ సమగ్రతను దెబ్బతీసింది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చారు. తమ ఉద్యోగులు వేరే చోట్ల పనిచేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని వివరించారు. విప్రోతోపాటు ఇన్ఫోసిస్ ​కూడా మూన్​లైటింగ్​కు వ్యతిరేకమని స్పష్టం చేసింది. ‘‘రెండు జీవితాలు వద్దు! రెండు ఉద్యోగాలు వద్దు! ఎంప్లాయీ హ్యాండ్​బుక్​, కోడ్​ ఆఫ్​ కండక్ట్​ ప్రకారం..మూన్​లైటింగ్​ నిషిద్ధం. డ్యూయల్​ ఎంప్లాయ్​మెంట్​కు మేం ఒప్పుకోం. రూల్స్​కు వ్యతిరేకంగా వెళ్లిన వారిని తొలగించడానికి కూడా వెనుకాడేది లేదు”అని ఉద్యోగులకు పంపించిన ఇంటర్నల్​ కమ్యూనికేషన్​లో స్పష్టం చేసింది.

స్విగ్గీలో అఫీషియల్​...

ఫుడ్ ఆర్డరింగ్  డెలివరీ ప్లాట్‌‌‌‌‌‌ఫారమ్ స్విగ్గీ మొట్ట మొదటిసారిగా మూన్‌‌‌‌లైటింగ్ పాలసీని ప్రవేశపెట్టింది. ఇక నుంచి స్విగ్గీ ఉద్యోగులు అదనపు ఆదాయం- కోసం ఇతర ప్రాజెక్ట్‌‌‌‌లను తీసుకోవచ్చు.  ఇందుకు ఇంటర్నల్ అప్రూవల్స్​ అవసరం. ఉద్యోగులు కొన్ని షరతులు పాటిస్తేనే  రెండవ ఉద్యోగం/పని చేయడానికి అనుమతి ఇస్తారు. ఆఫీస్ సమయం ముగిశాక లేదా వారాంతాల్లో ఇలాంటి పనులు చేసుకోవచ్చు.  ప్రొడక్టివిటీ దెబ్బతినని  పద్ధతిలో ఇతర వర్క్​ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. దేశవ్యాప్త లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ల సమయంలో చాలా మంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారని, రెండో జాబ్​ చేయడం మొదలుపెట్టారని సంస్థ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఒకరు అన్నారు.